వరుస భూకంపాలతో మహారాష్ట్రవాసులు ఆందోళన

 


వరుస భూకంపాలతో మహారాష్ట్రవాసులు ఆందోళనకు గురవుతున్నారు. ఆదివారం తెల్లవారుజామున 12.41 గంటలకు మరోసారి మహారాష్ట్రలోని హింగోలీ ప్రాంతంలో స్వల్పంగా భూకంపం సంభవించింది. నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ తెలిపిన వివరాల ప్రకారం.. రిక్టర్‌ స్కేలుపై భూకంప తీవ్రత 3.2 గా నమోదైంది. ఈ భూకంపం వల్ల భయపడాల్సింది లేదని, ఇప్పటి వరకు ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదని అధికారులు తెలిపారు.

గత మంగళవారం మహారాష్ట్రలోని పూణె జిల్లాలో 2.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. అంతకుముందు జనవరి 28 న తెల్లవారుజామున భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 2.8గా నమోదైంది. నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ తెలిపిన వివరాల ప్రకారం.. భూకంప కేంద్రం పశ్చిమ ఢిల్లీకి 15 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకఅతమైంది. దీనికిముందు జనవరి 13 న నోయిడాలో భూకంపం సంభవించింది. దీని తీవ్రత 2.9 గా నమోదైంది. ఢిల్లీ-ఎన్సీఆర్‌ ప్రాంతంలో కూడా డిసెంబరు 25 న స్వల్ప భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. స్వల్ప భూకంపాల వల్ల పెద్ద ప్రమాదం ఏమి ఉండదని అధికారులు చెబుతున్నారు. ఎవరూ భయాందోళనకు గురికావల్సిందేమిలేదని చెప్పారు. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లినట్లు సమాచారం అందలేదని అధికారులు పేర్కొన్నారు.