బోధన్‌ సభలో సంజయ్ సంచలన వ్యాఖ్యలు.

 


తెలంగాణలోని నిజమాబాద్ జిల్లా బోధన్‌లో బీజేపీ నిర్వహించిన బహిరంగ సమావేశలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం తీరును ఎండగడుతూ తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా సీఎం కేసీఆర్‌పై పలు కామెంట్స్ చేశారు. కేసీఆర్ వ్యవహార శైలి, మానసిక స్థితి సరిగా లేదని ఆరోపించారు. బీజేపీ పోరాటం వల్లే కేసీఆర్ ఉద్యోగ నియామక ప్రకటనలు చేస్తున్నారని అన్నారు. తెలంగాణ ఏర్పాటును ఎంఐఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేఖించిందని ఆరోపించారు. 12 శాతం ముస్లింలున్న బీహార్‌లో ఎంఐఎం 5 సీట్లు గెలిస్తే, 85 శాతం హిందూవులున్న తెలంగానాలో బీజేపీ ఎన్ని సీట్లు గెలవాలని ప్రశ్నించారు. మనది హిందు రాష్ట్రం, హిందు దేశమని అందరూ గుర్తుపెట్టుకొని ఓటు వేయాలన్నారు. హిందూ దేశంగా ఉన్నా, రామమందిర నిర్మాణానికి ఇన్ని ఏళ్ళు పట్టిందని, దీనికి కారణం సెక్యులర్ పేరుతో అన్ని పార్టీలు ప్రజలతో ఆడుకోవడమే అని వ్యాఖ్యానించారు. ఆర్టికల్ 370 రద్దు చరిత్రాత్మక నిర్ణయమన్నారు. భారతీయుల రక్షణ కోసమే బీజేపీ పని చేస్తోందని, దేశం కోసం త్యాగం చేసింది బీజేపీ మాత్రమే అని కొనియాడారు. దేశంలో హిందువులంతా ఒక్కటవుతున్నారని మిగితా పార్టీలు ప్రజాలను చీల్చే ప్రయత్నం చేస్తున్నాయని పేర్కొన్నారు. బండి సంజయ్ తొండి ఆట ఆడరని, తొడ గొట్టి ఆడతారని, అమర వీరుల త్యాగాల వల్ల తెలంగాణ ఏర్పడిందని గుర్తుచేశారు.