దేశ రాజధాని సరిహద్దుల్లో రిపబ్లిక్‌డే నాడు ట్రాక్టర్ ర్యాలీ


నూతన సాగుచట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని సరిహద్దుల్లో రెండు నెలలుగా ఆందోళన సాగిస్తున్న రైతు సంఘాలు మరింత పట్టుదలతో ముందుకు వెళ్తున్నాయి. రిపబ్లిక్‌డే నాడు ట్రాక్టర్ ర్యాలీకి ఓ వైపు సిద్ధమవుతూనే, ఫిబ్రవరి 1న పార్లమెంటుకు వివిధ ప్రాంతాల నుంచి పాదయాత్ర నిర్వహించనున్నట్టు తాజాగా ప్రకటించాయి. క్రాంతికారి కిసాన్ యూనియన్ నేత దర్శన్ పాల్ సోమవారంనాడు మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు.    సాగు చట్టాలను
రద్దు చేయాలంటూ గత ఏడాది నవంబర్ 26 నుంచి ఢిల్లీలోని పలు సరిహద్దు ప్రాంతాల్లో రైతు సంఘాలు ఆందోళన సాగిస్తున్నాయి. కాగా, నెలాఖరు నాటికి తమ డిమాండ్లు పరిష్కారం కాకుంటే ఫిబ్రవరి 1న వివిధ ప్రాంతాల నుంచి పార్లమెంటు వరకూ పాదయాత్ర నిర్వహిస్తామని దర్శన్ పాల్ తెలిపారు. ఆసక్తికరంగా, 2021-22 బడ్జెట్‌ను ఇదే రోజు కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది.