ఉత్తరాదినీ వణికిస్తున్న మంచు తుఫాన్...

 


ఉత్తరాదిన మంచు తుఫాన్ వణికిస్తోంది. ముఖ్యంగా హిమాచల్‌ప్రదేశ్‌లోని మనాలీలో భారీగా మంచుకురుస్తున్న నేపధ్యంలో 500 మంది పర్యాటకులు చిక్కుకుపోయారు. వీరంతా అటల్ టన్నల్‌కు చెందిన సౌత్ పోర్టల్, మనాలీ పరిధిలోని సోలాంగ్ మధ్య రోడ్డు మార్గంలో చిక్కుకుపోయారని అధికారులు తెలిపారు. వీరిని సురక్షిత ప్రదేశానికి తరలించేందుకు రెస్క్యూ బృందం అక్కడకు చేరుకుని, సహాయక చర్యలు ముమ్మరం చేసింది. మరోవైపు భారత వాతావరణశాఖ హిమాచల్‌లో ఎల్లో ఎలర్ట్ జారీ చేసింది. మనాలీలో చిక్కుకుపోయిన పర్యాటకులను కాపాడేందుకు చర్యలు కుంటున్నామని మనాలీ సబ్ డివిజినల్ మెజిస్ట్రేట్ రమణ్ ఘర్సాంగీ తెలిపారు. ఇప్పటికే ప్రత్యేక రెస్క్యూ బృందం డూండీ చేరుకుందని, వీరితో పాటు 20 రెస్క్యూ వాహనాలు కూడా అక్కడికి తరలించామని ఆయన తెలిపారు. అలాగే, టాక్సీలతో పాటు 48 సీట్లు కలిగిన బస్సును కూడా కులాంగ్‌కు పంపించామన్నారు. ప్రస్తుతం సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయన్నారు. కాగా ఈనెల 5 వరకూ హిమాచల్‌లో భారీగా మంచు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ హెచ్చరించింది.