'లవ్ స్టోరీ' సినిమా టీజర్ విడుదల.

 


టాలీవుడ్‌లో మరో ‘లవ్‌స్టోరీ’ హంగామా మొదలైంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న లవ్‌స్టోరీ సినిమా టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. అమిగోస్‌ క్రియేషన్స్’‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. టీజర్‌ చూస్తుంటే మరో అందమైన ప్రేమకథను సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. శేఖర్ కమ్ముల గత చిత్రాలు చూస్తే ఎంత పెద్ద ఘన విజయాన్ని సాధించాయో అందరికి తెలిసిందే. లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, హ్యపీడేస్, ఫిదా సినిమాలతో ఎందరో నటీనటులను టాలీవుడ్‌కి పరిచయం చేశాడు. శేఖర్ కమ్ముల అంటేనే ఒక సెన్సిటివిటీ. ఆయనో బ్రాండ్. కమ్ముల శైలి గురించి ప్రత్యేకించి వర్ణించాల్సిన అవసరం లేదు. మిడిల్ క్లాస్ కుటుంబాలు అందులోని సున్నిత ఉద్వేగాలు. మధ్యలో అమ్మాయి అబ్బాయి లవ్, కెరీర్, బరువు బాధ్యతలు కష్టాలు ఇష్టాలు ఇవన్నీ కనిపిస్తాయి. ఇంతకుముందు ఫిదా చిత్రంలో సాయి పల్లవి పాత్రకు నైజాం యాసను జోడించి మ్యాజిక్ చేసారు కమ్ముల. ఇప్పుడు అదే మ్యాజిక్ ని కంటిన్యూ చేస్తూ సాయి పల్లవి పాత్రను డిజైన్ చేశారు. హైదరాబాదీ‌ స్టైల్లో ‘జీరోకెల్లి వచ్చినా సార్‌.. చానా కష్టపడతా..మంచి ప్లాను ఉంది’ అంటూ నాగ చైతన్య చెప్పే డైలాగ్‌ ఆసక్తికరంగా ఉంది. రేవంత్‌ పాత్రలో చైతు, మౌనిక పాత్రలో సాయిపల్లవి ఒదిగిపోయినట్టు అనిపిస్తోంది. పవన్‌ సీహెచ్‌ అందించిన నేపథ్యసంగీతం ఆకట్టుకుంటోంది. చివర్లో నాగచైతన్యతో ఏందిరా వదిలేస్తావా నన్ను అంటూ సాయిపల్లవి అన్న మాటలు ప్రేక్షకులను ఎమోషన్‌కు గురిచేస్తున్నాయి. మొత్తం మీద ‘లవ్‌స్టోరీ’ టీచర్ ఇప్పుడు నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది.