తేజస్ లైట్ కంబాట్ యుద్ధవిమానాలను కొనుగోలుపై కేంద్రప్రభుత్వం ఆమోద ముద్ర

 వాయుసేన అవసరాల కోసం 83 తేజస్ లైట్ కంబాట్ యుద్ధవిమానాలను కొనుగోలుపై కేంద్రప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ప్రధానమంత్రి నేతృత్వంలో భధ్రతపై కేబినెట్ కమిటీ బుధవారం సమావేశమై 73 తేజస్ ఫైటర్ జెట్లు, 10 ట్రెయినర్ యుద్ధవిమానాల కొనుగోలుకు ఆమోదం తెలిపింది. వీటి విలువ రూ. 45,700లు. తేజస్ లైట్ కంబాట్ యుద్ధవిమానం భారత వాయుసేనకు రాబోయే సంవత్సరాల్లో వెన్నెముకగా నిలుస్తుందని భావిస్తున్నారు. భారత వైమానిక చరిత్రలో ఎన్నడూ లేన్నని నూతన సాంకేతిక నైపుణ్యాలను తేజస్ ఇముడ్చుకుందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ట్వీట్ చేశారు. భారతీయ రక్షణ రంగ ఉత్పత్తులలో స్వావలంబనకు సంబంధించి ఇదొక మూలమలుపు ఘట్టం కానుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న తేలికపాటి యుద్ధవిమానాల వర్యావరణ వ్యవస్థను గణనీయంగా విస్తరించగలదని, దాంతోపాటు అనేక కొత్త ఉద్యోగ అవకాశాలను కల్పించగలదని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. భారతీయ వైమానిక ఉత్పత్తుల రంగం రూపురేఖలను ఇది మార్చివేయదలదని చెప్పారు.తేజస్ ఎమ్‌కె-1ఎ తేలికపాటి యుద్ధవిమానం దేశీయంగా తయారు చేసిన నాలుగోతరం యుద్ధవిమానం. ఇది ఆటోమేటిగ్గా ఎలెక్ట్రానిక్ రూపంలో పనిచేసే రాడార్‌ను, ఎలెక్ట్రానికి వార్‌ఫేర్ సూట్‌ని, ఆకాశంలోనే ఇంధనాన్ని నింపుకోగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. గత సంవత్సరం మే నెలలో భారత వాయుసేన తేజస్ జెట్లతో కూడిన రెండో స్క్వాడ్రన్‌ను అమలులోకి తీసుకొచ్చింది. వీటిని తమిళనాడులోని కోయంబత్తూరు సమీపంలోని సులూర్ స్థావరంలోని నంబర్ 18 స్క్వాడ్రన్‌కు అందించింది. ప్లైయింగ్ బుల్లెట్స్ అని పేరుకున్న ఈ స్క్వాడ్రన్‌కి నాలుగో తరం తేజస్ ఎమ్‌కె-1ఎ లైట్ కంబాట్ యుద్ధవిమానాలను జత చేయనున్నారు.