భారీగా నష్టపోయిన ముఖేష్ అంబాని


రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీకి సోమవారం చేదు జ్ఞాపకాల్ని మిగిల్చింది. సోమవారం ఒక్కరోజే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) ఇండెక్స్ నిఫ్టీలో రిలయన్స్ షేర్ ఐదు శాతానికి పైగా కోల్పోయింది. ఫలితంగా రిలయన్స్ కుటుంబ సభ్యుల సంపద 5.2 బిలియన్ల డాలర్ల మేరకు హరించుకుపోయింది. పలు నిఫ్టీ-50 కంపెనీల కంటే అంబానీ కుటుంబం ఎక్కువ మార్కెట్ క్యాపిటల్‌ను కోల్పోయింది. నిఫ్టీ-50లో ఇంట్రా ట్రేడింగ్‌లో నిమిషానికి 12 మిలియన్ల డాలర్ల మేరకు ఇన్వెస్టర్లు సంపద కోల్పోయారు.  సోమవారం ట్రేడింగ్‌లో భారీగా మార్కెట్ క్యాపిటల్ కోల్పోవడంతో ముకేశ్ అంబానీ.. ప్రపంచ సంపన్నుల జాబితాలో 11వ స్థానం నుంచి 12వ స్థానానికి పడిపోయారని బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ పేర్కొంది. సోమవారం స్టాక్ ప్రైస్ క్రాష్ నేపథ్యంలో ముకేశ్ అంబానీ సంపద 79.2 బిలియన్ల డాలర్ల వద్ద స్థిర పడింది. ధీరూబాయి అంబానీ స్థాపించిన రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న ముకేశ్ అంబానీకి సంస్థలో 50.54 శాతం వాటా ఉంది.  కొటక్ ఇన్‌స్టిట్యూషనల్ ఈక్విటీస్ సంస్థ ప్రతిస్పందిస్తూ.. మూడో త్రైమాసికంలో రిలయన్స్ నిర్వహణ ప్రగతి బలహీనంగా ఉంది. ఇది మార్కెట్ అంచనాలను చేరుకోలేదని వ్యాఖ్యానించింది. భారీగా రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ కోల్పోవడంతో కొంత సేపు మార్కెట్ లీడర్ హోదాను కోల్పోయింది. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ముగిసే సమయానికి టీసీఎస్‌పై స్వల్పంగా రిలయన్స్ పై చేయి సాధించింది.