కరోనా మూలాలపై పరిశోధన చేపట్టేందుకు చైనా చేరుకున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణుల బృందం ఇటీవలే 14 రోజుల క్వారంటైన్ ముగించుకుంది. క్షేత్రస్థాయిలో కరోనా మూలాలపై పరిశోధనను ప్రారంభించింది. మహమ్మారి పుట్టిల్లుగా భావిస్తున్న వుహాన్ నగరంలో మొట్టమొదట కరోనా రోగులకు చికిత్స అందించిన ఆస్పత్రుల్లో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా శనివారం నిపుణులు జిన్యాన్టాన్ ఆస్పత్రిని సందర్శించారు. శుక్రవారం చైనా శాస్త్రవేత్తలతో చర్చలు జరిపారు. హుబెయ్ ప్రావిన్సులోని కొన్ని ఆస్పత్రులను సందర్శించారు. అలాగే వైరస్ తొలుత వెలుగులోకి వచ్చిన సీ-ఫుడ్ మార్కెట్, వివాదాస్పదంగా మారిన వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సహా మరికొన్ని స్థానిక ల్యాబ్లను సందర్శించనున్నారు. ప్రాథమిక దర్యాప్తులో కొంత సమాచారం సేకరించామని, వైరస్ మూలాలను కనుగొనేందుకు మరింత లోతైన దర్యాప్తు చేపట్టాలని డబ్ల్యూహెచ్వో గురువారం చేసిన ట్వీట్లో పేర్కొంది.