ట్రంప్ కి షాక్ ల మీద షాక్ లు .. ఆవేదన వ్యక్తం నిషేధం కొనసాగింపు

 అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చెందిన యూట్యూబ్ చానల్‌పై ప్రస్తుతం ఉన్న నిషేధాన్ని మరింత కాలం పాటు పొడిగిస్తున్నట్టు యూట్యూబ్ సంస్థ తాజాగా వెల్లడించింది. ఈ ఖాతాతో పాటు ట్రంప్ లాయర్ రూడీ గిలియానీకి చెందిన యూట్యూబ్ చానల్ మోనిటైజేషన్‌ను కూడా నియంత్రిస్తున్నట్టు ప్రకటించింది. మోనిటైజేషన్ ఆపడం వల్ల రూడీ గిలియానీ యూట్యూబ్ చానల్ వీడియోలపై వచ్చే సంపదకు అడ్డుకట్ట పడనుంది. జో బైడెన్‌పై ఆరోపణలు చేయడమే కాకుండా ఎన్నికల్లో మోసం జరిగిందంటూ రూడీ గిలియానీ అనేక వీడియోలను తన యూట్యూబ్ చానల్‌లో అప్‌లోడ్ చేస్తూ వచ్చారు. ఈ కారణంగానే యూట్యూబ్ ఆయన చానల్‌పై కూడా చర్యలు తీసుకుంది. కాగా.. జనవరి ఆరో తేదీన ట్రంప్ మద్దతుదారులు వాషింగ్టన్‌లోని కేపిటల్ భవనంపై దాడికి దిగిన విషయం తెలిసిందే. ఈ ఘటన తరువాత సోషల్ మీడియా దిగ్గజాలు ట్రంప్ ఖాతాలను సస్పెండ్ చేశాయి. గూగుల్‌కు చెందిన యూట్యూబ్ కూడా ఆ తర్వాత ట్రంప్ యూట్యూబ్ చానల్‌పై నిషేధాన్ని విధించింది. ఫేస్‌బుక్, ట్విటర్ కేపిటల్ భవనంపై దాడి జరిగిన వెంటనే ట్రంప్ ఖాతాపై నిషేధాన్ని విధించాయి. యూట్యూబ్ మాత్రం వెంటనే నిషేధం విధించకపోవడంతో సంస్థపై అనేక విమర్శలు కూడా వచ్చాయి. ట్రంప్ యూట్యూబ్ చానల్‌కు దాదాపు 30 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.