ఒడిశాలో ఘోర ప్రమాదం .

 


ఒడిశాలో ఘోర ప్రమాదం జరిగింది. రూర్‌కెలా స్టీల్ ప్లాంట్‌లో గ్యాస్ లీకై నలుగురు మృత్యువాత పడగా, 10 మందికి గాయాలయ్యాయి. బుధ‌వారం ఉద‌యం స్టీల్ ప్లాంట్‌లోని ఓ యూనిట్‌లో ఒక్కసారిగా విష‌పూరిత గ్యాస్ లీకైన‌ట్లు అధికారులు గుర్తించారు. కోల్ కెమిక‌ల్ డిపార్ట్‌మెంట్ ప్లాంట్ నుంచి కలుషితమైన గాలి వ్యాపించింది. దాన్ని పీల్చిన న‌లుగురు కార్మికులు మ‌ర‌ణించిన‌ట్లు అధికారులు తెలిపారు. ప్రమాద స‌మ‌యంలో ప్లాంట్‌లో 15 మంది ఉద్యోగులు ప‌నిచేస్తున్నారు. స్పృహ త‌ప్పిప‌డిపోయిన వారిని ప్లాంట్ స‌మీపంలో ఉన్న హాస్పిట‌ల్‌లో చేర్పించారు. ఐసీయూలో చికిత్స పొందుతూ నలుగురు మృతిచెందారు. కాగా, మరికొందరు క్షతగాత్రులను ఇస్పాట్ జ‌న‌ర‌ల్ హాస్పిట‌ల్‌కి తరలించారు. మిగిలినవారిని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు స్థానిక అధికారులు తెలిపారు. గ్యాస్ లీకేజీకి సంబంధించి సమాచారం అందుకున్న అగ్ని మాప‌క సిబ్బంది అక్కడ‌కు చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. కోల్ కెమిక‌ల్ సైట్‌లోని సేఫ్టీ వాల్వ్ స‌డ‌న్‌గా పేల‌డం వ‌ల్ల ఈ ప్రమాదం జ‌రిగిన‌ట్లు అధికారులు భావిస్తున్నారు. ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.