పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక కసరత్తును కాంగ్రెస్ పార్టీ ముమ్మరం చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థిత్వంపై గాంధీభవన్‌లో సోమవారం టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కుసుమ్‌కుమార్, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, శ్రీనివా్‌సకృష్ణన్ అభిప్రాయ సేకరణ చేపట్టారు.మూడు ఉమ్మడి జిల్లాల్లోని డీసీసీ అధ్యక్షులు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఆశావహుల అభిప్రాయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా తమ సామాజిక, ఇతర సమీకరణాలను ఆశావహులు వివరించారు. వచ్చిన అభిప్రాయాలన్నీ క్రోడీకరించి అధిష్ఠానానికి పంపడానికి మూడు పేర్లు సిద్ధం చేసినట్లు చెబుతున్నారు.
ఏఐసీసీ కార్యదర్శులు చిన్నారెడ్డి, వంశీచంద్‌రెడ్డి, మేడ్చల్ డీసీసీ అధ్యక్షుడు కూన శ్రీశైలంగౌడ్ పేర్లను అధిష్ఠానం వద్దకు పంపే ప్యానల్లో ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా సాగర్ ఉప ఎన్నికల నేపథ్యంలో నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల నియోజవకర్గ అభ్యర్థి విషయంలో ఆచితూచి వ్యవహరించాలని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది. ఈ నియోజకవర్గంలో కోదండరాం అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వాలని టీజేఎస్ కోరుతోంది. మరో వైపు మాజీ ఎమ్మెల్సీ రాములునాయక్, మానవతారాయ్, బెల్లయ్యనాయక్ ఈ స్థానం నుంచి పోటీకి దరఖాస్తు చేసుకున్నారు. వీటన్నింటి పరిగణనలోకి తీసుకొని నిర్ణయం తీసుకోనున్నట్లు చెబుతున్నారు.