హైదరాబాద్‌లో భారీ చోరీ జరిగింది. నమ్మకంగా ఉంటాడని పనిలో పెట్టుకున్న వ్యక్తి భారీ మోసానికి పాల్పడ్డాడు. ఈ ఘటన కాచిగూడలో చోటు చేసుకుంది. నమ్మకంగా ఉంటున్నట్లు నటిస్తూనే ఇంట్లో ఉన్న 80 తులాల బంగారం, 30 తులాల వెండి మూటగట్టుకుపోయాడు. టూరిస్ట్ హోటల్ చౌరస్తాలోని గోకుల్ధామ్ అపార్ట్మెంట్లో ఈ భారీ చోరీ జరిగినట్లుగా పోలీసులు తెలిపారు. ప్లాట్ నంబర్ 205లో వ్యాపారి విజయ్కాలే, ఆయన భార్య ఛాయా కాలే నివాసముంటున్నారు. విజయ్కాలే ఆరోగ్యం బాగా లేకపోవడంతో అతడిని చూసుకునేందుకు తూర్పుగోదావరిహైదరాబాద్లో భారీ చోరీ జిల్లాకు చెందిన నందగోపాల్ అనే వ్యక్తిని పనిలో పెట్టుకున్నారు. అనారోగ్యం కారణంగా విజయ్కాలే హైదర్‌గూడలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. చాలా కాలంగా నమ్మకంగా ఉంటున్నాడు అనుకున్న వ్యక్తి చోరీకి పాల్పడటంతో అంతా షాక్ అయ్యారు. గురువారం ఉదయం 9.30గంటలకు ఇంటిని శుభ్రం చేసేందుకు నందగోపాల్‌కు ఛాయా కాలే తాళాలు ఇచ్చి పంపింది. అతడు 11.30గంటలకు తిరిగి ఆస్పత్రికి వచ్చి తాళాలు ఇచ్చాడు. ఆ తర్వాత నందగోపాల్ బయటకు వెళ్లి తిరిగి రాలేదు. రాత్రి 9 గంటలకు ఇంటికి వెళ్లిన ఛాయా కాలే.. బీరువాను తెరిచి చూడగా అందులోని రూ.50లక్షల విలువైన 80 తులాల బంగారు ఆభరణాలు, 30 తులాల వెండి కనిపించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనాస్థలానికి పోలీసులు చేరుకుని ఆధారాలను సేకరించారు. నిందితుడు నందగోపాల్ డూప్లికేట్ తాళం చెవితో బీరువాను తెరిచి దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడి కోసం మూడు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి