రైతు పోరాటం ల:పలు చోట్ల ఆందోళనకారులు పోలీసులపై కర్రలతో, తల్వార్లతో దాడి


 సాగు చట్టాల రద్దుపై రైతు పోరాటం హింసాత్మకమైంది. పలు చోట్ల ఆందోళనకారులు పోలీసుల
పై కర్రలతో, తల్వార్లతో దాడి చేశారు. ఢిల్లీ రవాణాశాఖకు చెందిన ఆర్టీసీ బస్సుల అద్దాలు పగులగొట్టారు. ఎర్రకోటపైకి ఎక్కి జెండాలు ఎగురవేశారు. మరోవైపు రైతుల ఆందోళన హింసాత్మకంగా మారడంతో పార్లమెంట్, రాష్ట్రపతి భవన్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఢిల్లీ మెట్రో స్టేషన్లు మూసివేశారు. ఇంటర్‌నెట్ సేవలను నిలిపివేశారు. మరోవైపు తమ ఆందోళనలోకి అసాంఘిక శక్తులు చొరబడ్డాయని రైతు సంఘాల ఐక్యవేదిక నాయకుడు రాకేశ్ తికాయత్ ఆరోపించారు. ట్రాక్టర్ల ర్యాలీ హింసాత్మకంగా మారడంతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలో 15 కంపెనీల పారామిలిటరీ బలగాలను మోహరించాలని నిర్ణయించారు. ఆందోళనల్లో ఓ రైతు ప్రాణాలు కోల్పోయాడు. అయితే, ట్రాక్టర్‌ పల్టీ కొట్టడం వల్లే ఆ రైతు మరణించాడని ఢిల్లీ పోలీసులు స్పష్టంచేశారు. ఇందుకు సంబంధించిన సీసీ ఫుటేజీని పోలీసులు విడుదల చేశారు. అతివేగంగా బారికేడ్లవైపు దూసుకొచ్చిన ట్రాక్టర్‌, వాటిని ఢీకొట్టి పల్టీ కొట్టడంతోనే రైతు ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు ప్రకటించారు. అంతకు ముందు, రైతు మరణానికి పోలీసులే కారణమంటూ ఐటీఓ కూడలిలో రైతులు ఆందోళన చేపట్టారు. దీన్ని ఖండించిన పోలీసులు, తాజాగా వీడియోను విడుదల చేశారు. కేంద్రం తీసుకొచ్చిన సాగు చట్టాలను రద్దుచేయాలని డిమాండ్‌ చేస్తూ రైతులు చేపట్టిన గణతంత్ర పరేడ్‌లో 109 మంది పోలీసులు గాయపడ్డట్లు అధికారులు తెలిపారు. ట్రాక్టర్ల పరేడ్‌లో భాగంగా నిర్దేశిత రూట్‌లో కాకుండా ఆందోళనకారులు ఎర్రకోటను చుట్టుముట్టడంతో.. వారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో పలువురు పోలీసులు కోట గోడలపై నుంచి కింద పడడంతో పలువురికి గాయాలు అయ్యాయి. భద్రతా బలగాల్లో ఎక్కువగా ఢిల్లీ పోలీసులు గాయపడ్డారు. దీంతో పోలీసులు పలువురు ఆందోళనకారులపై 4 కేసులు నమోదు చేశారు. వీటిలో మూడు తూర్పు ఢిల్లీ స్టేషన్‌లో కేసులు నమోదు చేయగా, ఒకటి సహదర స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ట్రాక్టర్‌ పరేడ్‌ చేపట్టిన రైతు సంఘాలు ముందస్తుగా అంగీకరించిన నిబంధనల్ని ఉల్లంఘించారని ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు. అనుమతించిన సమయం కన్నా ముందే ర్యాలీని ప్రారంభించడమే కాకుండా హింస, దాడులకు రైతులు కారణమయ్యారని పోలీసులు వెల్లడించారు. మరోవైపు ఆందోళనకారులు ఎర్రకోటపై ఎగరేసిన జెండాలను పోలీసులు తొలగించారు. ఎర్రకోట పరిసరాల నుంచి ఆందోళనకారులంతా వెళ్లిపోయారని నిర్ధారణ అయిన తర్వాతే పోలీసులు జెండాలను తొలగించారు. గణతంత్ర వేడుకల అనంతరం ఆందోళనకారులు ఒక్కసారిగా ఎర్రకోటపైకి దూసుకురావడంతో 300 మంది కళాకారులు కోటలో దాక్కున్నారు. వారిని పోలీసులు సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు. ఈ ఘటనపై పోలీసులు మరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.