రైతుల పెన్షన్ స్కీమ్ పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.

 రైతుల పెన్షన్ స్కీమ్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాన మంత్రి కిసాన్ మాన్‌ధన్ యోజన పేరుతో పథకాన్ని కేంద్రం కొంత కాలం క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే. వృద్ధాప్యంలో రైతులకు ఆసరాగా నిలవనున్న ఈ పథకంలో.. లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ) ద్వారా రైతులకు నెలకు రూ. 3 వేలు అందిస్తున్నారు. అలా ఒక రైతుకు ఏడాదికి రూ.36వేలు పెన్షన్ అందజేస్తున్నారు. అయితే, ఈ పథకం పొందాలంటే రైతు కొంత మొత్తం ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు రైతులే తమ జేబు నుంచి ఈ ప్రీమియంను చెల్లించే వారు. అయితే ఇక నుంచి ఆ అవసరం లేకుండా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రైతు సాయం కింద కేంద్ర ప్రభుత్వం ఏడాదికి రూ. 6000 చొప్పున రైతులకు ఇస్తున్న విషయం తెలిసిందే. అలా వచ్చిన సొమ్ము నుంచే నేరుగా రైతు పెన్షన్‌ స్కీమ్‌ ప్రీమియం కట్ అయ్యేలా కేంద్ర వ్యవసాయ శాఖ ఏర్పాట్లు చేసింది. దీంతో ఇక నుంచి ఏ రైతు కూడా ప్రత్యేకంగా తన జేబు నుంచి డబ్బు కట్టాల్సిన పని ఉండదని కేంద్ర వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. కిసాన్ మాన్‌థన్ పథకం.. ఇదిలాఉండగా కిసాన్ మాన్‌థన్ పథకంలో ఇప్పటి వరకు 21 లక్షలకు పైగా రైతులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఈ పథకంలో నమోదు కాని రైతులు ఇప్పుడు కూడా చేరే అవకాశం ఉంది. రెండు హెక్టార్ల భూమి కలిగి,18 ఏళ్ల నుంచి గరిష్టంగా 40 ఏళ్ల వయస్సు ఉన్న ఏ రైతు అయినా ఈ పెన్షన్‌ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఈ స్కీమ్‌లో చేరడానికి రైతులు కొంత ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఈ పథకంలో చేరే నాటికి వయస్సును బట్టి రూ. 55 నుంచి రూ.200 చొప్పున ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఆ లెక్కన 18 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు ఈ పథకంలో చేరితో రూ.55 ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది. ఇక 30 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు చేరితే రూ. 110 ప్రీమియం, 40 ఏళ్లు ఉన్నప్పుడు చేరితే రూ.200 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఇలా ప్రతీ నెలా రైతులు తమకు 60 సంవత్సరాలు నిండే వరకు ఈ ప్రీమియంను చెల్లించాల్సి ఉంటుంది. అయితే రైతులు ఎంత ప్రీమియం అయితే చెల్లిస్తారో కేంద్ర ప్రభుత్వం కూడా అంతే ప్రీమియం చెల్లిస్తుంది. ఇక రిటైర్మెంట్ వయసు.. అంటే 60 సంవత్సరాలు దాటిన తరువాత సదరు రైతులకు నెలకు రూ. 3వేల చొప్పున పెన్షన్‌ను కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఒకవేళ ఈ పథకంలో పేరు నమోదు చేసుకున్న రైతు మధ్యలోనే మరణిస్తే అతని భార్యకు 50శాతం(నెలకు రూ.1500) ఫ్యామిలీ పెన్షన్ లభిస్తుంది. ఈ స్కీమ్‌లో చేరాలనుకునే రైతులు దగ్గర్లోని కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్‌సీ)కి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. బ్యాంక్ పాస్‌బుక్, ఆధార్ నెంబర్ తప్పనిసరిగా అవసరమవుతాయి. అయితే, ఈ స్కీమ్‌లో చేరడానికి ప్రత్యేకంగా డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. కేవలం ప్రతి నెలా ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది. కాగా, నేషనల్ పెన్షన్ స్కీమ్, ఎంప్లాయీస్ స్టేట్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ స్కీమ్, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ లాంటి ఇతర సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్‌లో ఉన్నవారికి ప్రధాన మంత్రి కిసాన్ మాన్‌ధన్ యోజన వర్తించదు. సంక్షిప్తంగా ఈ పథకం యొక్క ప్రత్యేకతలు.. దీని కనీస ప్రీమియం రూ .55 నుంచి రూ .200 వరకు ఉంటుంది. పాలసీ హోల్డర్ రైతు మరణిస్తే, అతని భార్యకు 50 శాతం (రూ .1500) లభిస్తుంది. ప్రీమియం రైతు ఎంత చెల్లిస్తాడో కేంద్ర ప్రభుత్వం కూడా అంతే చెల్లిస్తుంది. మధ్యలో పాలసీని వదిలివేయాలనుకుంటే.. మీరు జమ చేసిన డబ్బు, దానికి సాధారణ వడ్డీ కలిపి ఇచ్చేస్తారు. రిజిస్ట్రేషన్ కోసం ఎటువంటి రుసుము ఉండదు. నమోదు కోసం ముఖ్యమైన విషయాలు.. పెన్షన్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవడానికి కామన్ సర్వీస్ సెంటర్ (సిఎస్సి) లో రిజిస్ట్రేషన్ జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డు ఇవ్వడం తప్పనిసరి. 2 ఫోటోలతో పాటు బ్యాంక్ పాస్‌బుక్ కూడా అవసరం. రిజిస్ట్రేషన్ సమయంలో కిసాన్ పెన్షన్ ప్రత్యేక సంఖ్య, పెన్షన్ కార్డు సృష్టించబడతాయి.