కోర్టు ఆదేశించినప్పటికీ విచారణకు గైర్హాజరైన డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌

 

కోర్టు ఆదేశించినప్పటికీ   విచారణకు గైర్హాజరైన డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టుకు రాలేకపోవడానికి అఫిడవిట్‌లో ఆయన పేర్కొన్న కారణం సహేతుకంగా లేదని స్పష్టం చేసింది. హాజరు నుంచి మినహాయించాలన్న అభ్యర్థనను తోసిపుచ్చుతూ డీజీపీతోపాటు ఐజీ మహేశ్‌చంద్ర లడ్డాకు నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ (ఎన్‌బీడబ్ల్యూ) జారీ చేసి విచారణను వాయిదా వేయబోయింది. డీజీపీ హాజరయ్యేందుకు మరొక అవకాశమివ్వాలని లేదా మెరుగైన అఫిడవిట్‌ దాఖలుకు తావివ్వాలని ఈ సమయంలో డీజీపీ తరఫు సీనియరు న్యాయవాది ఎస్‌ఎస్‌ ప్రసాద్‌ కోరారు. ఈ అభ్యర్థనను న్యాయమూర్తి పరిగణనలోకి తీసుకున్నారు. హాజరుకాలేకపోవడానికి డీజీపీ, ఐజీ పేర్కొన్న కారణాలు సంతృప్తికరంగా లేనప్పటికీ, వారి పోస్టులను పరిగణనలోకి తీసుకుని సోమవారం (జనవరి 25) నాటి విచారణకు హాజరు నుంచి మినహాయిస్తున్నట్లు పేర్కొన్నారు. తదుపరి విచారణను ఈనెల 27కు వాయిదా వేశారు. ఆ రోజు కోర్టు విచారణకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్‌ విశ్వజిత్‌, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, ఐజీ మహేశ్‌చంద్ర లడ్డా వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ సోమవారం ఈమేరకు ఆదేశాలనిచ్చారు.