ఈ నెల 17వ తేదీన కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ పుదుచ్చేరికి రానున్నారు. ఆరోజు రెడ్డియార్ మిల్ గ్రౌండ్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న బహిరంగసభలో ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు. ఆ తర్వాత సోలైనగర్‌లో మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించి వారి సమస్యలు అడిగి తెలుసుకోనున్నారు. అదే విధంగా వ్యాపారుల సమాఖ్య ప్రతినిధులతో కూడా రాహుల్ భేటీ అవుతారని పుదుచ్చేరి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు ఏవీ సుబ్రమణ్యం ఓ ప్రకటనలో తెలిపారు. పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టినప్పటికీ, వాటి అమలుకు లెఫ్ట్‌నెంట్ గవర్నర్ కిరణ్‌బేదీ పలు కొర్రీలు పెడుతున్నారు. దీంతో ఆమెను తొలగించాలంటూ నారాయణస్వామి, ఆయన మంత్రివర్గ సహచరులు నిరసన కార్యక్రమాలు, నిరహారదీక్షలతో పాటు రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్‌కు సైతం ఫిర్యాదు చేశారు. సంక్షేమ పథకాలు సరిగ్గా అమలుకాకపోవడంతో పార్టీ కార్యకర్తల్లోనూ కొంత నిస్తేజం నెలకొంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నప్పటికీ పార్టీలో ఆ వాతావరణం కనిపించడం లేదు. దీంతో పార్టీలో పరిస్థితిని చక్క దిద్దేందుకు కాంగ్రెస్ సిద్ధమైనట్టు సమాచారం. ఇందులో భాగంగానే తొలుత రాహుల్ పుదుచ్చేరిలో పర్యటించి వాస్తవ పరిస్థితులను తెలుసుకోనున్నట్టు తెలుస్తోంది.