విద్యుత్ చట్టం-2003లో ప్రతిపాదిత సవరణలపై కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ బుధవారం సమావేశం నిర్వహించనున్నారు. వర్చువల్ విధానంలో నిర్వహించనున్న సమావేశంలో సవరణ చట్టంలో ప్రధానంగా వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు బిగించడం, పునరుద్ధరణీయ ఇంధన వనరుల వినియోగం పెంచడం వంటి అంశాలపై రాష్ట్రాల మంత్రులు, ఇంధన శాఖ కార్యదర్శులు, డిస్కమ్‌ల సీఎండీలతో చర్చించనున్నారు. సదరన్ రీజియన్ (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి, లక్షద్వీప్) రాష్ట్రాలతో మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల దాకా ఈ సమావేశం జరుగనుంది. ఇప్పటికే సమావేశానికి సంబంధించిన అజెండాను అన్ని రాష్ట్రాల ఇంధన శాఖలకు పంపింది. నాలుగు అంశాలపై ఉంటుందని పేర్కొంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ప్రస్తావించిన్నట్లు విద్యుత్ వినియోగదారుడు డిస్కాంలను ఎంపిక చేసుకునే అవకాశంపై మొదటి పాయింట్‌గా చేర్చించింది. ప్రభుత్వం డిస్కాంలతో పాటు ప్రైవేట్ డిస్కాంలను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఈ మేరకు వీటి ఏర్పాటుపై చర్చించనుంది. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రుణాలు కావాలంటే విద్యుత్ సంస్థల్లో పెట్టుబడులను ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రాలకు నిబంధన విధించిన విషయం తెలిసిందే.