జేఈఈ మెయిన్‌-2021 పరీక్షలు ప్రారంభం



ఐఐటీ, ఎన్‌ఐటీ తదితర ప్రతిష్ఠాత్మక సాంకేతిక విద్యాసంస్థల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్‌-2021 పరీక్షలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. బుధ, గురు, శుక్రవారాల్లో పరీక్షలు కొనసాగుతాయి. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు తమకు కరోనాలేదని సెల్ఫ్‌ డిక్లరేషన్‌ ఇవ్వాల్సి ఉంటుందని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీఏ) తెలిపింది. కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ) విధానంలో జరిగే ఈ పరీక్షలకు దేశవ్యాప్తంగా 6,61,761 మంది విద్యార్థులు రిజిస్టర్‌ చేసుకొన్నారు. మన రాష్ట్రం నుంచి 73,782 మంది హాజరు కానున్నారు.రాష్ట్రంలో హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, రంగారెడ్డి, వరంగల్‌, కరీంనగర్‌, ఖమ్మం, నిజామాబాద్‌, నల్లగొండ, సిద్దిపేట, మహబూబాబాద్‌, మహబూబ్‌నగర్‌లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటుచేశారు. పరీక్ష ప్రారంభానికి రెండుగంటల ముందే కేంద్రానికి చేరుకోవాలని.. ఆలస్యంగా వచ్చేవారిని లోపలికి అనుమతించబోమని ఎన్టీఏ వర్గాలు తెలిపాయి. హాల్‌టికెట్‌తోపాటు ఆధార్‌, పాన్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఓటర్‌ ఐడీ, పాస్‌పోర్ట్‌లలో ఏదో ఒక గుర్తింపు కార్డును వెంట తెచ్చుకోవాలని సూచించారు. జేఈఈ మెయిన్‌ ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ సమయంలో అప్‌లోడ్‌ చేసినట్టుగానే ఉన్న పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోను కూడా విద్యార్థులు వెంట తీసుకెళ్లాలి.