క్రూయిజ్ నౌకలపై 2022 ఫిబ్రవరి వరకు నిషేధం : కెనడా ప్రభుత్వం

 

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఫిబ్రవరి 2022 వరకు క్రూయిజ్ నౌకలపై 2022 ఫిబ్రవరి వరకు నిషేధం విధిస్తున్నట్లు కెనడా ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. 100 మందికి పైగా ప్రయాణించే నౌకలకు ఈ నిషేధం వర్తిస్తుందని కెనడా రవాణ శాఖ మంత్రి ఒమర్ అల్గాబ్రా చెప్పారు. అత్యంత హానికరమైన కరోనా వ్యాప్తిని నివారించడానికి క్రూయిజ్ నౌకల రాకపోకలపై తాత్కాలిక నిషేధం అవసరమని మంత్రి ఒమర్ చెప్పారు. ఉత్తరఅమెరికాలో కరోనా మహమ్మారి వల్ల గత ఏడాది ఏప్రిల్ క్రూయిజ్ నౌకల సంచారంపై నిషేధం విధించారు.

కెనడియన్ ఓడరేవు నగరాలైన వాంకోవర్, క్యూబెక్, మాంట్రియల్ ల నుంచి క్రూయిజ్ నౌకలు తిరుగుతుండేవి. కరోనా వల్ల క్రూయిజ్ నౌకలపై నిషేధం విధించడం వల్ల ఈ పరిశ్రమకు తీవ్ర దెబ్బ తగిలినట్లయింది. 2019లో కెనడాకు 12 దేశాల నుంచి క్రూయిజ్ నౌకలు సందర్శించగా, వీటిలో 2 మిలియన్ల మంది పర్యాటకులున్నారని కెనడా మంత్రిత్వశాఖ తెలిపింది. క్రూయిజ్ నౌకల పర్యాటక పరిశ్రమ కరోనా వల్ల తీవ్ర సంక్షోభంలో మునిగింది. కెనడాలో 8 లక్షల కొవిడ్ కేసులు నమోదు కాగా, 20,500 మంది మరణించారు.