తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన నాటి నుంచి 1,50,326 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఇందులో ఇప్పటి వరకు వివిధ నియామకాల ఏజెన్సీల ద్వారా 1,32,899 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చారు. వీటిలో 1,26,641 మంది నియామకాలు ఇప్పటికే పూర్తయ్యాయి, వీరంతా ప్రస్తుతం ఉద్యోగాలు చేస్తున్నారు. మరో 23,685 ఉద్యోగ నియామకాలు తుదిదశలో ఉన్నాయి. త్వరలోనే నియామకాలూ పూర్తవుతాయి. గత ఆరున్నరేండ్లలో టీఎస్పీఎస్సీ ద్వారా 39,952 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చింది. వీటిలో 30,594 పోస్టుల నియామకాలు పూర్తయ్యాయి. మరో 9,358 నియామకాల ప్రక్రియ ప్రాసెస్‌లో ఉన్నది. పోలీస్ రిక్రూట్‌మెంట్‌బోర్డు, రెసిడెన్షియల్ స్కూల్స్ ఉద్యోగాలకు ప్రత్యేక రిక్రూట్మెంట్ బోర్డు, వైద్య శాఖలో ఉద్యోగాలకు ప్రత్యేక రిక్రూట్మెంట్ బోర్డులు, డిపార్ట్మెంట్ సెలెక్షన్ కమిటీలు ఇలా వివిధ ఏజెన్సీల ద్వారా వేలాది ఉద్యోగ నియామకాలను సర్కారు చేపట్టింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం 9,355 మంది పంచాయతీ కార్యదర్శులను నియమించింది. విద్యుత్తు సంస్థల్లో కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తున్న 22,637 మంది కార్మికులను ఆర్టిజన్స్‌గా గుర్తించి శాశ్వత ప్రాతిపదికన ఉండే ఉద్యోగుల మాదిరిగా వారికి వేతనాలు,ఇతర భత్యాలు అందిస్తున్నది. ప్రాసెస్‌లో ఉన్న 23,685 ఉద్యోగాలు కోర్టు కేసులతో ఆగిపోయినట్లు సమాచారం. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న దాదాపు 50 వేల పోస్టుల భర్తీకి సీఎం కేసీఆర్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. దీంతో పెండింగ్‌లో ఉన్న పదోన్నతుల ప్రక్రియను ఇప్పటికే పూర్తిచేశారు. అనంతరం ఖాళీ అయిన స్థానాలను గుర్తించి జాబితా సిద్ధంచేశారు. త్వరలోనే వీటికి నోటిఫికేషన్లు రానున్నాయి.