నెల రోజుల వ్యవధిలో 24 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులకు పదోన్నతులు

 


తెలంగాణలో నెల రోజుల వ్యవధిలో 24 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులకు పదోన్నతులు దక్కాయి. సీఎం కేసీఆర్‌ నిర్దేశించిన గడువు మేరకు ఆదివారం వరకు ఈ ప్రక్రియ కొనసాగింది. గడువుకు చివరి రోజు సహకార, పురపాలక, పరిశ్రమలు, రెవెన్యూ తదితర శాఖల్లో పదోన్నతులకు సంబంధించిన ఉత్తర్వులిచ్చారు. దీంతో పాటు శాఖాపరమైన పదోన్నతుల కమిటీ (డీపీసీ) ఆమోదించిన మరో వేయి మందికి సీఎం ఆమోదంతో త్వరలో పదోన్నతి కల్పించనున్నారు. అధికశాతం శాఖల్లో పదోన్నతులు వచ్చినా కీలకమైన విద్యా, పోలీసు తదితర శాఖల్లో కోర్టు కేసులు, సీనియారిటీ వివాదాల కారణంగా ఈ ప్రక్రియ జరగలేదు. దీనిని గుర్తించిన ప్రభుత్వం సమస్యల పరిష్కారానికి కృషిచేయాలని నిర్ణయించింది. ఈ నెలాఖరు వరకు 24,201 మందికి పదోన్నతులిచ్చారు. అత్యధికంగా పురపాలక శాఖలో, ఆ తర్వాత సంక్షేమ శాఖల్లో పదోన్నతులిచ్చారు. విద్య, పోలీసు తదితర ప్రధాన శాఖల్లో పూర్తిస్థాయి పదోన్నతుల ప్రక్రియ జరగలేదు. సచివాలయంలోనూ ఇలాంటి వివాదమే ఉంది. దీంతో ఆయా శాఖల్లోని ఉపాధ్యాయ, ఉద్యోగుల్లో కొంత అసంతృప్తి నెలకొంది. దీనిపై ప్రభుత్వం దృష్టి సారించింది.

రాష్ట్రవ్యాప్తంగా జరిగిన పదోన్నతులపై ఒకట్రెండు రోజుల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నివేదిక ఇవ్వనున్నారు. దీంతో పాటు అనేక శాఖల్లో ప్రక్రియ జరగకపోవడానికి కారణాలు, వాటి పరిష్కారానికి ప్రయత్నాలను ఆయన నివేదించనున్నట్లు తెలిసింది. ప్రజారోగ్య సంచాలకుల పరిధిలో ఎన్నడూ లేని విధంగా ఒకే దఫాలో 943 మంది ఉద్యోగులకు పదోన్నతులు కల్పించారు.