వైరస్ నిరోధానికి మార్చి 3వతేదీ వరకు కర్ఫ్యూ

 


నెదర్లాండు దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు మార్చి 3వతేదీ వరకు కర్ఫ్యూ పొడిగిస్తున్నట్లు ఆ దేశ ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. నెదర్లాండ్సు దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్నందున ముందుజాగ్రత్తగా ఈ వైరస్ నిరోధానికి మార్చి 3వతేదీ వరకు కర్ఫ్యూను పొడిగిస్తున్నట్లు నెదర్లాండ్ దేశ మంత్రివర్గం వెల్లడించింది. కర్ఫ్యూను అమలు చేయడంతో పాటు కొవిడ్ నిర్బంధ చర్యలను మార్చాలా వద్దా అనేది ఫిబ్రవరి 23వతేదీన నెదర్లాండ్ కేబినెట్ నిర్ణయించనుంది. నెదర్లాండు దేశంలో జనవరి 23వతేదీ రాత్రి 9 గంటల నుంచి కరోనా నిరోధానికి కర్ఫ్యూ విధించారు. కర్ఫ్యూను ఉల్లంఘించిన వారికి 95 యూరోల జరిమానా విధించాలని నిర్ణయించారు. కరోనా కట్టడి కోసం గత ఏడాది దిసెంబరు 15 నుంచి ఫిబ్రవరి 9 వతేదీ వరకు లాక్ డౌన్ విధించారు. లాక్ డౌన్ సమయంలో ఆహారం నిత్యావసర సరుకులు మినహా అన్ని దుకాణాలను మూసివేశారు. రెస్టారెంట్లు,కేఫ్‌లు, మ్యూజియంలు సినిమా థియేటర్లు, వినోద ఉద్యానవనాలు,జంతుప్రదర్శనశాలలు, కాసినోలు, ఆవిరి స్నానాలు, ఈత కొలనులు, క్రీడా సౌకర్యాలు, క్యాటరింగ్ పాయింట్లు, క్షౌరశాలలు, బ్యూటీ సెలూన్లు ,పచ్చబొట్టు పార్లర్‌లను మూసివేశారు. నెదర్లాండు దేశంలో పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు రిమోట్ ఆపరేషన్ పద్ధతిలో పనిచేస్తున్నాయి.