40 లక్షల ట్రాక్టర్లతో రైతులు కదం తొక్కాలి. పార్లమెంట్‌ ముట్టడి

 


కేంద్రం నూతన సాగు చట్టాలను రద్దు చేయకుంటే రైతులు పార్లమెంటును ఘోరావ్‌ చేసేందుకు సిద్ధంగా ఉండాలని రైతు సంఘాల నాయకుడు రాకేశ్‌ టికాయిత్‌ పేర్కొన్నారు. ఇందుకోసం 'దిల్లీ మార్చ్‌' ర్యాలీకి ఏ సందర్భంలోనైనా రైతు సంఘాలు పిలుపు ఇవ్వొచ్చని ఆయన తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళవారం రాజస్థాన్‌లోని సికార్‌లో నిర్వహించిన కిసాన్‌ మహాపంచాయత్‌లో రైతులను ఉద్దేశించి మాట్లాడారు.


'ఇక పార్లమెంటును ఘోరావ్‌ చేయాల్సిన సమయం ఆసన్నమైంది. అందుకోసం దిల్లీ మార్చ్‌ చేపట్టేందుకు త్వరలో మేం ప్రకటన చేస్తాం. ఈ సారి 4 లక్షలు కాదు.. 40 లక్షల ట్రాక్టర్లతో రైతులు కదం తొక్కాలి. పార్లమెంట్‌ ముట్టడికి సంబంధించిన తేదీని యునైటెడ్‌ ఫ్రంట్‌ నాయకులు త్వరలో నిర్ణయిస్తారు. జనవరి 26న రైతులు తలపెట్టిన ట్రాక్టర్‌ ర్యాలీలో హింసాత్మక ఘటనల ద్వారా రైతుల్ని అపఖ్యాతి పాలు చేసే కుట్ర జరిగింది. ఈ దేశ రైతులు జాతీయ పతాకాన్ని ప్రేమిస్తారు.. కానీ నాయకుల్ని కాదు. కేంద్రం ఈ మూడు సాగు చట్టాల్ని రద్దు చేయకుంటే.. దేశవ్యాప్తంగా ఉద్యమం తీవ్ర రూపం దాలుస్తుంది' అని టికాయిత్‌ స్పష్టం చేశారు.