దేశంలో టాప్‌-5 విద్యాసంస్థల సరసన ఉస్మానియా ఇంజినీరింగ్‌ కళాశాల

 


ఉస్మానియా ఇంజినీరింగ్‌ కళాశాల టెక్విప్‌-3 నిధుల వినియోగంలో జాతీయస్థాయిలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. 1.07 స్కోర్‌ సాధించడం ద్వారా దేశంలో టాప్‌-5 విద్యాసంస్థల సరసన నిలవనుంది. సాంకేతిక విద్యాసంస్థల్లో ప్రమాణాలు పెంచేందుకు కేంద్రం సాంకేతిక విద్య నాణ్యత మెరుగుదల (టెక్విప్‌) పేరిట నిధులు మంజూరు చేస్తోంది. కళాశాలకు రూ.7.7 కోట్లు మంజూరు కాగా ప్రాజెక్టు సంచాలకుడు, ప్రిన్సిపల్‌ ఎం.కుమార్‌ వివిధ కార్యక్రమాలు చేపట్టారు. ప్రయోగశాలల ఆధునికీకరణ-సామగ్రి కొనుగోలు, ఆచార్యులకు శిక్షణ, పరిశోధక విద్యార్థులకు ఉపకార వేతనాలు, సాంకేతిక వనరులు సమకూర్చడం, విద్యార్థులందరికీ గేట్‌ పరీక్ష ఫీజు రీఎంబర్స్‌మెంట్‌, ఉద్యోగాల సాధనకు నైపుణ్యాభివృద్ధి నిర్వహణ చేపట్టారు. ఈనెల 16, 17న జాతీయ ప్రాజెక్టుల అమలు సంస్థ మెంటార్‌ ప్రొ.జేపీ గుప్తా ఆడిట్‌ నిర్వహించారు. 1 స్కోర్‌ వస్తే అత్యుత్తమం, 3 వస్తే ఫర్వాలేదని. కళాశాల 1.07 స్కోర్‌ సాధించడంతో న్యాక్‌, ఎన్‌బీఏ గుర్తింపు విషయంలోనూ కీలకం కానుందని ప్రిన్సిపల్‌ తెలిపారు.