మహబుబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 59 మంది 90నామినేషన్లు దాఖలయ్యాయి. సోమవారం ఒక్కరోజే 26మంది 47సెట్ల నామినేషన్లు వేసినట్టు ఎన్నికల అధికారులు ప్రకటించారు. సోమవారం నామినేషన్ వేసినవారిలో టీఆర్ఎస్ అభ్యర్థి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కూతురు సురభివాణిదేవి, బీజేపీ అభ్యర్థి ఎన్.రాంచందర్‌రావు, కాంగ్రెస్ అభ్యర్థి జి.చిన్నారెడ్డి, కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి హర్షవర్దన్‌రెడ్డి, స్వతంత్ర అభ్యర్థులు సామల వేణు, జాకబ్‌రాజు ఉన్నారు.
టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణిదేవి నామినేషన్...
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణిదేవి నామినేషన్‌కు ముందు తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, సబితారెడ్డి, ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి, మాజీ మంత్రులు మహేందర్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీలు నారాయణరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ప్రకాష్‌గౌడ్, మహేష్‌రెడ్డిలతో కలిసి నివాళలు అర్పించారు. అనంతరం జీహెచ్ఎంసీలోని రిటర్నింగ్ ఆఫీసర్‌కు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, రాజ్యసభ సభ్యులు కె.కేశవరావులతో కలిసి నామినేషన్ పత్రాలను అందజేశారు. అయితే ఎన్నికల సంఘం ఫార్మాట్ ప్రకారం పత్రాలు, ఫొటోలు లేకపోవడంతో నామినేషన్ వేయడానికి ఆలస్యమైందని, నామినేషన్ పత్రాల్లేకపోవడంతో నాలుగు గంటలపాటు రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయంలోనే ఉన్నారని, నామినేషన్ వేయకుండానే వెనుదిరిగారనే ప్రచారం జరిగింది. ఈ విషయాలపై ఎన్నికల అధికారులను అడగ్గా 'వాణిదేవి నామినేషన్ వేశారు. అన్ని పత్రాలు సరిగ్గానే ఉన్నాయి. అనవసరంగా ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఫోటోలు ఇవ్వలేదు. వాటిని ఈనెల 26వ తేదిలోపు అందజేయడానికి అవకాశముంది' అని వివరించారు. తప్పుడు ప్రచారం ఖండించారు. వాణిదేవి మాట్లాడుతూ నామినేషన్ వేశానని, కచ్చితంగా గెలుస్తానని ధీమా వ్యక్తంచేశారు.