నీతి ఆయోగ్‌ పాలక మండలి 6వ సమావేశం

 


నీతి ఆయోగ్‌ పాలక మండలి 6వ సమావేశం శనివారం జరుగనుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన పాలక మండలి వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా భేటీకానుంది. వ్యవసాయం, మౌలిక సదుపాయాలు, తయారీ, మానవ వనరుల అభివృద్ధి, క్షేత్రస్థాయి వరకు సేవల పంపిణీ, ఆరోగ్యం, పోషణపై సమావేశంలో చర్చ జరగనుంది. వివిధ రంగాలు, శాఖలు, సమాఖ్య సమస్యలపై చర్చించడానికి నీతి ఆయోగ్‌ పాలకమండలి ఒక వేదికగా పని చేస్తోంది. ఇందులో ప్రధానమంత్రి, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్‌ గవర్నర్లు పాల్గొంటారు. జమ్మూకశ్మీర్‌ కేంద్ర పాలితప్రాంతంగా పాల్గొనడంతో పాటు లద్దాఖ్‌ తొలిసారిగా ఈ సమావేశంలో పాల్గొంటోంది. సమావేశంలో పాలక మండలి సభ్యులు, కేంద్రమంత్రులు, నీతి ఆయోగ్‌ సీఈవో, కేంద్ర ప్రభుత్వ సీనియర్‌ అధికారులు పాల్గొననున్నారు.