గ్రామీణ అభివద్ధి ఉపాధి పథకం కింద పని చేస్తున్న 7,610 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీసీ సంఘం ఆధ్వర్యంలో ఫీల్డ్ అసిస్టెంట్లను ఉద్యోగాల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వందలాది మంది ఫీల్డ్ అసిస్టెంట్లు గురువారం హిమాయత్‌నగర్ లోని తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణ ఉపాధి కార్యాలయాన్ని ముట్టడించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యమం చేసి కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారని, ఉద్యమాలు చేసిన ఫీల్డ్ అసిస్టెంట్లను ఉద్యోగాల నుంచి తొలగించడంలో ఏమైనా న్యాయం ఉందా అని ప్రశ్నించారు. ప్రభుత్వం అన్యాయంగా తొలగించడంతో 27 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు చనిపోయారని, వేలాది మంది కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీల్డ్ అసిస్టెంట్ల చేసిన సమ్మె రాజ్యాంగ, ప్రజాస్వామ్యబద్ధమైన హక్కని, ఉద్యమాలు చేస్తున్న ఉద్యోగులను అణిచివేస్తామనే ధోరణి సరికాదన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, లేనిపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు ఉథృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకుడు వెంకటరాములు మాట్లాడుతూ రాష్ట్రంలో నీతి, నిజాయితీలతో పని చేస్తున్న ఏకైక వ్యవస్థ ఫీల్డ్ అసిస్టెంట్ల వ్యవస్థని అన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యల పరిష్కారం కోసం తమ సంఘం సంపూర్ణ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, బీసీ రక్షక్ దళ్ చైర్మెన్ ఉదరు కుమార్, బీసీ యువజన సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ చంటి ముదిరాజ్, బీసీ సంఘం నాయకులు చంద్రశేఖర్, చరణ్, బీసీ వెంకట్, మనోహర్, సైదులు తదితరులు పాల్గొన్నారు.