మహబూబ్‌నగర్‌- రంగారెడ్డి-హైదరాబాద్‌ ఎమ్మెల్సీ నియోజకవర్గ పరిధిలో మొత్తం 799 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు

 


మహబూబ్‌నగర్‌- రంగారెడ్డి-హైదరాబాద్‌ ఎమ్మెల్సీ నియోజకవర్గ పరిధిలో మొత్తం 799 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు నియోజకవర్గ రిటర్నిగ్‌ అధికారి, జీహెచ్‌ఎంసీ అడిషనల్‌ కమిషనర్‌ ప్రియాంక వెల్లడించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లపై జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో బుధవారం రాజకీయ పక్షాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల విభాగం ఆడిషనల్‌ కమిషనర్‌ పంకజ పాల్గొన్న ఈ సమావేశంలో కాంగ్రెస్‌, బీజేపీ, టీఆర్‌ఎస్‌, ఎంఐఎం తదితర పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సమావేశంలో రిటర్నింగ్‌ అధికారి ప్రియాంక అల మాట్లాడుతూ ఈనెల 23వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తామని అన్నారు. ఆదివారం సెలవు రోజు మినహా అన్ని పనిదినాల్లో నామినేషన్లు స్వీకరిస్తామన్నారు. కొవిడ్‌ నిబంధనల దృష్ట్యా నామినేషన్ల దాఖలు సందర్భంగా అభ్యర్థితో పాటు మరో ఇద్దరిని మాత్రమే అనుమతించాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు. అదే విధంగా కేవలం రెండు వాహనాలనే అనుమతిస్తామని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటి ప్రచారానికి కేవలం ఐదుగురితో మాత్రమే నిర్వహించాలని, రోడ్‌ షోలకు ఐదు వాహనాలకు మాత్రమే అనుమతిస్తామన్నారు.  ర్యాలీలు, సమావేశాలు, బహిరంగ సభలకు ముందస్తు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. ఎలక్ట్రానిక్‌, ప్రింట్‌ ఇతర మాధ్యమాల్లో ప్రచారం నిర్వహించేందుకు ప్రకటనలను మీడియా సర్టిఫికేషన్‌, మానిటరింగ్‌ కమిటీ ముందస్తు అనుమతి పొందాల్సి ఉంటుందన్నారు. ఈ ఎన్నికలకు వ్యయంపై ఏ విధమైన నియంత్రణ లేదని, అయితే ఎన్నికల ప్రచార వ్యయ వివరాలను మాత్రం రిటర్నింగ్‌ అధికారికి సమర్పించాల్సి ఉంటుందని ఆమె తెలిపారు. బ్యాలెట్‌ పత్రాలపై అభ్యర్థి పేరు, ఫొటో, పార్టీ పేరును మాత్రమే తెలియజేస్తామని ప్రియాంక అల తెలిపారు. ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్నికల్లో 80 సంవత్సరాలు పైబడిన వృద్ధ్దులు, దివ్యాంగులు, కొవిడ్‌ వ్యాధిగ్రస్తులకు పోస్టల్‌ బ్యాలెట్లను అందజేస్తామని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమాల నిర్వహణపై ముందస్తుగా అనుమతులు పొందాల్సి ఉంటుందని ఆమె ఈ సందర్భంగా స్పష్టం చేశారు.  రెండో రోజు రెండు నామినేషన్ల దాఖలు  మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్‌ నియోజవర్గ స్థానానికి బుధవారం రెండు నామినేషన్లు దాఖలయ్యాయి. స్వతంత్ర అభ్యర్థులుగా పూజారి లింగం గౌడ్‌, రాష్ట్రీయ లోక్‌దళ్‌ (ఆర్‌ఎల్‌డీ) అభ్యర్థిగా కపిలవాయి దిలీప్‌కుమార్‌ నామినేషన్లు దాఖలు చేశారు. రెండు రోజుల వ్యవధిలో మొత్తం 5 నామినేషన్లు దాఖలయ్యాయి.