నేటి నుంచి 9, 10 తరగతులతోపాటు ఇంటర్, డిగ్రీ, ఇతర వృత్తి విద్య కళాశాలల్లో ప్రత్యక్ష బోధన



 కరోనా మహమ్మారి కారణంగా పాఠశాలలు, కాలేజీలు దాదాపుగా మూతబడే ఉన్నాయి. తెలంగాణలో చాలా వరకూ అధికారులు పిల్లలను పాఠశాలలకు పిలిచి రిస్క్ తీసుకోవాలని అనుకోలేదు. తాజాగా మాత్రం స్కూళ్లు, కాలేజీలు తెరుచుకున్నాయి. దాదాపు ఏడు నెలలుగా మూతబడిన విద్యాసంస్థలు తెలంగాణలో నేటి నుంచి తెరుచుకోనున్నాయి. నేటి నుంచి 9, 10 తరగతులతోపాటు ఇంటర్, డిగ్రీ, ఇతర వృత్తి విద్య కళాశాలల్లో ప్రత్యక్ష బోధన ప్రారంభం కానుంది. వైద్య కళాశాలలు, సంక్షేమ గురుకుల విద్యాలయాలు కూడా నేటి నుంచి తెరుచుకోనున్నాయి. తెలంగాణలోని 970 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ గురుకుల పాఠశాలలు కూడా నేటి నుంచి తిరిగి తెరుచుకోనున్నాయి.  పిల్లలను బడికి పంపేందుకు తమకు అభ్యంతరం లేదన్న తల్లిదండ్రుల లేఖ ఉంటేనే విద్యార్థులను అనుమతిస్తారు. పాఠశాల తరగతి గదిలో విద్యార్థుల మధ్య ఆరడుగుల దూరం తప్పనిసరి చేయనున్నారు. క్లాస్ రూములో 20 మంది విద్యార్థులను మాత్రమే అనుమతిస్తారని తెలుస్తోంది. మధ్యాహ్న భోజనం, టాయిలెట్లు, చేతులు శుభ్రం చేసుకునే ప్రాంతాల్లో గుండ్రని గీతలు గీశారు. విద్యార్థులు వాటి ప్రకారమే నడుచుకోవాల్సి ఉంటుంది. ప్రతి స్కూల్‌లోనూ ఓ ఐసోలేషన్ గదిని ఏర్పాటు చేశారు. విద్యార్థులు ఎవరిలోనైనా కరోనా లక్షణాలు కనిపిస్తే ఆ గదికి పంపించి తల్లిదండ్రులకు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు సమాచారం అందించనున్నారు. అవసరమైన విద్యార్థులకు ప్రాథమిక వైద్యం అందించేందుకు వైద్యులు 24 గంటలూ అందుబాటులో ఉంటారు.  31-01-2021న తెలంగాణ అధికారులు వెల్లడించిన కరోనా వివరాల ప్రకారం తెలంగాణలో గత 24 గంటల్లో కొత్తగా 163 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్రకారం... గత 24 గంటల్లో కరోనాతో ఒకరు ప్రాణాలు కోల్పోగా, అదే సమయంలో 276 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,94,469 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,90,630 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,599 కి పెరిగింది. తెలంగాణలో ప్రస్తుతం 2,240 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 828 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీలో కొత్తగా 28 కరోనా కేసులు నమోదయ్యాయి.