సలార్.. ఉగ్రం సినిమాకు రీమేక్

 


సలార్.. కొన్ని రోజులుగా ఈ పేరు సోషల్ మీడియాలో బాగా వినిపిస్తోంది. దానికి కారణం ప్రభాస్ కొత్త సినిమా పేరు కావడమే. కే జి ఎఫ్ సినిమాతో దేశ వ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాను తెరకెక్కించబోతున్నాడు. ఫస్ట్ లుక్ విడుదల అయిన వెంటనే ప్రభాస్ అభిమానులు పండగ చేసుకున్నారు. కోరమీసాలతో ఈ మధ్య కాలంలో ఎప్పుడూ లేనంత కొత్తగా మాస్ లుక్ లో కనిపించాడు ప్రభాస్. అయితే ఈ సినిమాపై కొన్ని రూమర్స్ వస్తూనే ఉన్నాయి. సినిమా మొదలుపెట్టిన రోజు నుంచే ఇది ఉగ్రం సినిమాకు రీమేక్ అనే ప్రచారం మొదలైంది. కన్నడలో ప్రశాంత్ నీల్ తొలి సినిమా ఇది. శ్రీమురళి హీరోగా నటించిన ఈ చిత్రం కన్నడలో 200 రోజులు ఆడేసింది.

ఈ సినిమాతో స్టార్ డైరెక్టర్ అయిపోయాడు ఈయన. ఆ తర్వాతే కెజియఫ్ కథ రాసుకున్నాడు. ఇప్పుడు ఇదే సినిమాను ప్రభాస్ హీరోగా రీమేక్ చేస్తున్నాడని ప్రచారం జరుగుతుంది. దీనిపై ఆ మధ్య దర్శకుడు ఓపెన్ అయ్యాడు. ఈ కథకు ప్రభాస్ తప్ప మరో హీరో తనకు కనిపించడం లేదని కుండబద్దలు కొట్టాడు. ప్రభాస్ వంటి హీరో కన్నడ లోనే కాదు.. ఎక్కడా లేడని ప్రశాంత్ చెప్పుకొచ్చాడు. తన కథకు అమాయకమైన లుక్స్ ఉండే స్టార్ హీరో కావాలని.. ప్రభాస్ లో ఆ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని క్లారిటీ ఇచ్చాడు ఈ దర్శకుడు. అలాంటి క్వాలిటీస్ ఉన్న మరో హీరో తనకు కనిపించలేదని.. ప్రభాస్ అయితే ఇలాంటి పాత్రలకు సరిగ్గా సరిపోతాడు అని చెప్పాడు ప్రశాంత్. 'సలార్' లాంటి డార్క్ యాక్షన్ సినిమాకి అమాయకత్వంతో అవసరం ఏంటి అని చాలామందికి అనుమానం వస్తుంది.. కానీ తన కథలో హీరో ముందు అమాయకంగా ఉండి ఆ తర్వాత ఒక నాయకుడిగా ఎదిగాడు అనేది చూపిస్తున్నాను అంటున్నాడు.


ఇన్నోసెంట్ గా ఉండే హీరో కరుడుగట్టిన నాయకుడిగా ఎలా మారాడు అనే జర్నీ చూపించడంలో ప్రభాస్ నటన మరో స్థాయిలో ఉంటుంది అంటున్నాడు ప్రశాంత్. అయితే ఈ సినిమా ఉగ్రం రీమేక్ కాదని ప్రశాంత్ చెప్పినా కూడా సంగీత దర్శకుడు రవి బస్రూర్ మాత్రం నోరు జారాడు. ఉగ్రం సినిమా కథను అప్ గ్రేడ్ చేసి ప్రభాస్‌తో రీమేక్ చేస్తున్నాడు అంటూ అసలు విషయం చెప్పేసాడు. దాంతో ఇన్నాళ్లూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నిజమే అని అర్థమైపోయింది. ఉగ్రం కథనే ప్రభాస్ ఇమేజ్‌కు తగ్గట్లుగా మార్చి తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్ నీల్. కచ్చితంగా యూనివర్సల్ అప్పీల్ ఉన్న కథ కావడంతో సలార్ సంచలనం రేపడం ఖాయంగా కనిపిస్తుంది. ఆల్రెడీ బౌండెడ్ స్క్రిప్ట్ ఉండటంతో షూటింగ్ కూడా వేగంగానే పూర్తవుతుంది. అక్టోబర్ నాటికి టాకీ పూర్తి చేసి.. సంక్రాంతి 2022కు సినిమా విడుదల చేయాలని చూస్తున్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఏదేమైనా కూడా సలార్ రీమేక్ అనే నిజం మాత్రం యూనిట్ నుంచే బయటికి వచ్చింది.