పుదుచ్చేరిలో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) కూటమి

 


పుదుచ్చేరిలో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) కూటమి పుదుచ్చేరిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు రాకపోవడంతో లెఫ్టినెంట్ గవర్నర్ తిమిళిసై సౌందరరాజన్ రాష్ట్రపతి పాలనకు కోరారు. ఐదుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో కాంగ్రెస్ నేతృత్వంలోని పుదుచ్చేరి ప్రభుత్వం కూలిపోయిన విషయం తెలిసిందే.


ఈ నేపథ్యంలో బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అంతా ఊహించారు. కానీ, అలా జరగలేదు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు ఉండటం ఆ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు రాలేదని తెలుస్తోంది. దీంతో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కేంద్రానికి లేఖ రాశారు. దీనిపై బుధవారం జరిగే కేంద్ర కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.


కాగా, పుదుచ్చేరి శాసనసభలో 30 స్థానాలుండగా గతంలో కాంగ్రెస్, డీఎంకే, స్వతంత్ర అభ్యర్థితో కలిపి 18 మంది సభ్యులతో ఈ కూటమి నారాయణస్వామి నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇటీవల మంత్రి నమశివాయం, ఎమ్మెల్యే తీపాయన్ దాన్ రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఆ తర్వాత మరో ఇద్దరు ఎమ్మెల్యేలు మల్లాడి కృష్ణారావు, జాన్ కుమార్ కూడా రాజీనామా చేశారు. కొద్దిరోజుల క్రితం, మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా రాజీనామాలు చేయడంతో కూటమి బలం 12కు పడిపోయింది.


ఎన్నార్ కాంగ్రెస్ 7, అన్నాడీఎంకే 4, బీజేపీ 3(నామినేటెడ్)తో కూటమి బలం 14గా ఉంది. సభలో ప్రస్తుతం సభ్యుల బలం 26కు చేరింది. కాగా, గత సోమవారం (ఫిబ్రవరి 22న) సాయంత్రం 5 గంటలకు బల నిరూపణ పరీక్ష నిర్వహించాల్సి ఉన్నప్పటికీ.. తగిని సంఖ్యా బలం లేకపోవడంతో అంతకుముందే సీఎం నారాయణస్వామి తన పదవికి రాజీనామా చేశారు. ఎల్జీ తమిళిసైకి తన రాజీనామా లేఖను అదే రోజు అందజేశారు.