ఏపీ పంచాయతీ ఎన్నికలు ఆఖరి దశ

 


ఏపీ పంచాయతీ ఎన్నికలు ఆఖరి దశకు చేరాయి. నాల్గో విడతలో భాగంగా ఆదివారం ఉదయం 6.30 గంటల నుంచి పోలింగ్‌ ప్రారంభమైంది. ఆఖరి విడుతలో 161 మండలాల్లోని 2,743 సర్పంచ్‌ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా.. 7,475 మంది అభ్యర్ధులు పోటీ పడుతున్నారు. తుది విడతలో 3,299 పంచాయతీల్లో ఎన్నికలకు నోటిఫికేషన్‌ జారీ కాగా.. 554 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. వైఎస్సార్‌ కడప జిల్లాలో రెండు చోట్ల నామినేషన్లు దాఖలు కాలేదు. దీంతో ఆదివారం 2,743 చోట్ల ఎన్నికలు జరుగనున్నాయి. ఆఖరి విడతలో 33,435 వార్డులకుగానూ 10,921 చోట్ల ఏకగ్రీవమయ్యాయి. మరో 91 చోట్ల వార్డు పదవులకు నామినేషన్లు దాఖలు కాకపోవడంతో 22,423 వార్డులకు పోలింగ్‌ జరుగుతుండగా.. వార్డు పదవులకు 52,700 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. సాయంత్రం 3.30 గంటల వరకు పోలింగ్‌ జరుగనుండగా.. సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు.