వచ్చే శని, ఆదివారాల్లో భారీ నిరసనలకు రైతులు ప్లాన్‌

 

ఢిల్లీ సరిహద్దుల్లో రైతు ఉద్యమం ఉధృతమవుతోంది. వచ్చే శని, ఆదివారాల్లో భారీ నిరసనలకు రైతులు ప్లాన్‌ చేస్తున్నారు. ఘాజీపూర్‌ సరిహద్దుకు ప్రతి ఇంటి నుంచి ఒక్క రైతునైనా పంపాలని పశ్చిమ యూపీలోని వివిధ జిల్లాల్లో జరిగిన ఖాప్‌ పంచాయతీలు తీర్మానించాయి. దీంతో వారాంతంలో ఘాజీపూర్‌కు జన ప్రవాహం పెరగనున్నదని రైతు నేతలు చెబుతున్నారు. గుంపులు గుంపులుగా వస్తే పోలీసులు బారికేడ్లతో అడ్డుకుంటున్నారని, అందువల్ల ఘాజీపూర్‌ కు ఏ విధంగానైనా చేరుకునేందుకు వ్యూహరచన చేస్తున్నామని భారతీయ కిసాన్‌ యూనియన్‌ నేతలు తెలిపారు. మరోవైపు పోలీసు బలగాలను మరో రెండు వారాల పాటు సరిహద్దుల్లోనే కొనసాగించాలని కేంద్రం నిర్ణయించింది.

ఇక శనివారం దేశవ్యాప్తంగా మూడు గంటలపాటు చక్కా జామ్‌ నిర్వహించాలని రైతు నేతలు ఇప్పటికే పిలుపునిచ్చారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను చేస్తున్నారు. సింఘూ సరిహద్దులో రైతులు చక్కా జామ్‌ ఏర్పాట్లను సమీక్షించారు. అటు- సింఘూ వద్ద ఉన్న కార్యాలయాన్ని మార్చే ఉద్దేశంలో రైతు నేతలు ఉన్నారు. హిందూస్థాన్‌ స్టీల్‌ కంపెనీ ఆవరణను తమ ఆఫీసుగా మార్చుకుని తరుచూ ఆంతరింగక సమావేశాల కోసం వాడుకుంటున్నారు. రిపబ్లిక్‌ డే నాడు ఐటీవో వద్ద ట్రాక్టర్‌ తిరగబడి చనిపోయిన నవ్రీత్‌సింగ్‌ కుటుంబాన్ని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకవాద్రా పరామర్శించారు. రాంపూర్‌లోని రైతు స్వగ్రామానికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు. నవ్రీత్‌కు శ్రద్ధాంజలి ఘటించారు. పేదలు, రైతుల బాధను వినలేని, చూడలేని నేతల వల్ల ఈ దేశానికి ఉపయోగం లేదని ఈ సందర్భంగా ప్రియాంక కేంద్ర ప్రభుత్వంపై ఫైర్‌ అయ్యారు.