హిమానీనదాలు విరిగిపడటంతో పవర్‌ప్లాంట్‌ విద్వంసం

 


డెహ్రాడూన్‌ : ఉత్తరాఖండ్‌లో ఆదివారం హిమానీనదాలు విరిగిపడటంతో సంభవించిన వరదల్లో ముందస్తు సర్వే ప్రకారం.. పవర్‌ప్లాంట్‌తో పాటు మరో రెండు వంతెనలు కొట్టుకుపోయినట్లు భారత వైమానికి దళాలు తెలిపాయి. రాష్ట్ర రాజధాని డెహ్రాడూన్‌కు 280 కిలోమీటర్ల దూరంలో.. ధౌలిగంగా, రిషిగంగా నదుల సంగమం వద్ద తపోవన్‌కు సమీపంలో ఉన్న విష్ణుగడ్‌ పవర్‌ప్లాంట్‌తో పాటు మలారీ లోయ ప్రవేశద్వారం వద్ద ఉన్న రెండు ఆనకట్టలు కూడా కొట్టుకుపోయినట్లు నిఘా విమానాలు తీసిన చిత్రాల్లో కనిపించినట్లు పేర్కొన్నాయి. కాగా, 520 మెగావాట్ల విష్ణుగడ్‌ పవర్‌ప్లాంట్‌ ప్రాజెక్టును ప్రభుత్వం రూ. 3 వేల కోట్ల వ్యయంతో నిర్మిస్తోంది. జోషిమత్‌, తపోవన్‌ల మధ్య ఉన్న ప్రధాన రహదారి చెక్కుచెదరలేదని, అయితే నిర్మాణ పనుల నిమిత్తం లోయలో నిర్మించిన నివాసాలు ధ్వంసమయ్యాయని అన్నారు. నందాదేవి హిమానీ నదం ప్రవేశ ద్వారం నుండి ధౌలిగంగ, అలకనందా తీరం వెంబడి ఉన్న గ్రామాలైన పిపల్కోటి, చమోలి వరకు శిథిలాలు కనిపించాయని తెలిపాయి.


ధౌలీగంగ వరదల కారణంగా సమీపంలోని రుషిగంగ నదిలో కూడా నీటిప్రవాహం పెరగడంతో రేణి గ్రామం వద్ద దానిపై ఉన్న 12.3 మెగావాట్ల సామర్థ్యంగల చిన్న తరహా జలవిద్యుత్తు కేంద్రం కూడా నామరూపాలు లేకుండా పోయింది. ఈ గ్రామం వద్దే రుషిగంగ, ధౌలీ గంగ నదులు కలుస్తాయి. ఇక్కడి వంతెన కూడా కొట్టుకుపోయిందని ఇండో-టిబెటన్‌ బోర్డర్‌ పోలీసు అధికార ప్రతినిధి చెప్పారు. చైనా సరిహద్దుల్లోని బోర్డర్‌ పోస్టులకు వెళ్లేందుకు ఈ వంతెనే కీలకం. సమీపంలోని కొన్ని ఇళ్లు కూడా కొట్టుకుపోయాయి. జిల్లా కేంద్రం చమోలీని కలిపే పక్కా రోడ్డు, నాలుగు సస్పెన్షన్‌ బ్రిడ్జిలు దెబ్బతిన్నాయి. దీంతో ఏడు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ ప్రమాదంలో పది మంది మరణించగా.. 170 మంది గల్లంతైన సంగతి తెలిసిందే.