దుబాయి: యూఏఈలో నివసిస్తున్న భారతీయులకు అక్కడి ఇండియన్ ఎంబసీ గుడ్‌న్యూస్ చెప్పింది. అబూధాబీలోని ఇండియన్ ఎంబసీ ద్వారా భారతీయులు తమ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్(ఐడీపీ)ను ఇప్పుడు పునరుద్దరించుకోవచ్చని తెలిపింది. దీనికి సంబంధించి ఓ సర్కులర్‌ను సోమవారం విడుదల చేసింది. ఎవరైతే తమ ఐడీపీని పునరుద్దరించుకోవాలని అనుకుంటున్నారో వారంతా పని దినాల్లో(ఆదివారం- గురువారం మధ్య ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు) ఎంబసీని సంప్రదించాల్సి ఉంటుంది.
ఎంబసీని సంప్రదించే భారతీయులకు భారత ప్రభుత్వం పర్మిట్‌ను తప్పక జారీ చేసి ఉండాలి. భారత పర్మిట్ కలిగి ఉన్న వారు తమ ఒరిజినల్ పాస్‌పోర్ట్‌తో పాటు గడువు తీరిన పర్మిట్‌ను, ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్‌ను ఎంబసీ అధికారులకు చూపించాల్సి ఉంటుంది. అనంతరం www.parivahan.gov.in పోర్టల్‌లో దరఖాస్తుదారులు అవసరమైన డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాలి. పోర్టల్ ద్వారానే ఫీజు చెల్లించిన తర్వాత దరఖాస్తుదారునికి ఓ రిసీప్ట్ వస్తుంది. లైసెన్సింగ్ అథారిటీ డాక్యుమెంట్లను వెరిఫికేషన్ చేసి దరఖాస్తుదారుని ఇంటి అడ్రస్‌కు ఐడీపీని కొరియర్ చేస్తుంది.