మోడీ సర్కారు రూపొందించిన మూడు సాగు వ్యతిరేక చట్టాలని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘాలు పిలుపునిచ్చిన రైల్‌రోకో కార్యక్రమం నేడు( గురువారం) దేశవ్యాప్తంగా జరగనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు నాలుగు గంటల పాటు రైళ్లను నిలిపివేసి తమ నిరసన తెలపనున్నారు. ఇప్పటికే రహదారుల దిగ్బంధనం, ట్రాక్టర్ పరేడ్, చక్కాజామ్ నిర్వహించిన రైతులు తమ ఆందోళనని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసేందుకు ఈ విధంగా సన్నద్ధమయ్యారు. అయితే, రైతు ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేసేందుకు ఏదో రకంగా బీజేపీ యత్నిస్తుందని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) పేర్కొంది. ఈ మేరకు బుధవారం ఎస్కేఎం సమన్వయకర్త దర్శన్పాల్ ప్రకటన విడుదల చేశారు. ముజఫర్‌పూర్‌లో ఏఐకేకేఎంఎస్ నిర్వహిస్తున్న శాంతియుత నిరసనపై విహెచ్పీ గూండాలు చేసిన దాడిని ఎస్కేఎం ఖండించింది. బ్యానర్లు, ప్లకార్డులు, సౌండ్ సిస్టమ్‌ను ధ్వంసం చేశారు. పోలీసుల ప్రేక్షక పాత్ర కూడా ఖండించదగినదని పేర్కొన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపినడ్డా నేతృత్వంలో ఉన్నత స్థాయి సమావేశం జరిగిం దని, అందులో హర్యానా, యూపీ, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి ఎన్నికైన పార్టీ నాయకులతో పాటు కేంద్ర మంత్రులు అమిత్ షా, నరేంద్ర సింగ్ తోమర్ తదితరులు పాల్గొన్నారు.
అక్రమంగా కేసులు బనాయిస్తే కుదరదు : ఢిల్లీ కోర్టు
తిరుగుబాటు చేస్తున్నారని ఎవరిపైన పడితే వారిపై 'దేశద్రోహం' కేసులు పెట్టడానికి వీల్లేదని ఢిల్లీ కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బలవంతంగా కొంతమంది నోరు మూయించడానికో, నోరుతెరి పించ డానికో ఐపీసీలోని సెక్షన్ 123ఏని అడ్డుపెట్టుకోవడానికి వీల్లేదని ఢిల్లీ కోర్టు అడిషినల్ సెషన్ ధర్మేందర్ వ్యాఖ్యానించారు. రైతు ఉద్యమానికి మద్దతు తెలిపిన దేవీలాల్ బుర్దాక్, స్వరూప్ రామ్ అనే ఇద్దరు రైతుల పై ఢిల్లీపోలీసులు దేశద్రోహం కేసులు నమోదుచేయటాన్ని న్యాయ స్థానం తప్పుబట్టింది.