టోల్‌ ప్లాజాలకు ముందే ఫాస్టాగ్‌ కౌంటర్లు

 


 జాతీయ రహదారులపై ఉన్న అన్ని టోల్‌ ప్లాజాలు సోమవారం నుంచి నగదు రహిత చెల్లింపు పద్ధతిలోకి మారనున్నాయి. తొలుత ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచే ఈ విధానాన్ని అమలు చేయాలని అనుకున్నారు. మరింత గడువు ఇవ్వాలని కేంద్ర జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ చివరి నిమిషంలో నిర్ణయించింది. ఆ గడువు ఆదివారం అర్ధరాత్రితో ముగియనుంది. దానిప్రకారం ఫిబ్రవరి 15 నుంచి నగదు రహిత చెల్లింపు విధానం అమలు కానుంది. రాష్ట్రంలో రాకపోకలు సాగించే వాహనాల్లో 82 శాతానికి ఫాస్టాగ్‌లు ఉన్నట్లు జాతీయ రహదారుల సంస్థ గణాంకాలు చెబుతున్నాయి. తెలంగాణ నుంచి వెళ్లే జాతీయ రహదారుల్లో 21 ప్రాంతాల్లో టోల్‌ ప్లాజాలు ఉన్నాయి. సుమారు ఏడాదిన్నరగా ఫాస్టాగ్‌ విధానాన్ని అమలు చేస్తున్నారు. టోల్‌ ప్లాజాల వద్ద ఒక వరుసలో నగదును కూడా అనుమతిస్తూ వస్తున్నారు. జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఇప్పటిదాకా ఆ ఒక్క వరుసను కూడా నగదు రహితంగా మార్చేందుకు గడువును నిర్దేశిస్తూ, తిరిగి వాయిదా వేస్తూ వస్తోంది.


ఫాస్టాగ్‌ లేకుండా టోల్‌ప్లాజాలోకి వాహనాలను అనుమతించం. ఇప్పటి వరకు ప్లాజా దాటిన తర్వాత విక్రయ కేంద్రాలు ఉండేవి. ఇక నుంచి అన్ని టోల్‌ప్లాజాలకు రావటానికి ముందే విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. అదనపు సిబ్బందిని ఏర్పాటు చేశాం.