పాస్‌పోర్టు దరఖాస్తు చేసుకునే విధానాన్ని కేంద్ర ప్రభుత్వం మరింత సులభతరం

 


పాస్‌పోర్టు దరఖాస్తు చేసుకునే విధానాన్ని కేంద్ర ప్రభుత్వం మరింత సులభతరం చేసింది. ఎలాంటి ఒరిజినల్‌ ధృవపత్రాలు మోసుకెళ్లకుండానే తేలికగా పాస్‌పోర్టుకు దరఖాస్తు చేసుకునే సౌలభ్యాన్ని కల్పిస్తున్నట్లు పేర్కొంది. పాస్‌పోర్టు దరఖాస్తు చేసుకునే సమయంలో డిజిలాకర్‌లో ఉన్న డాక్యుమెంట్లను వినియోగించుకోవచ్చని స్పష్టంచేసింది. తాజా సౌలభ్యంతో పాస్‌పోర్టు దరఖాస్తు సమయంలో ఎటువంటి ఒరిజినల్‌ ధృవపత్రాలను తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు.


డిజిలాకర్‌ ప్లాట్‌ఫాం సహాయంతో పాస్‌పోర్టు దరఖాస్తు సౌలభ్యాన్ని కేంద్ర విదేశాంగశాఖ సహాయమంత్రి వీ మురళీధరన్‌ ఈ మధ్యే ప్రారంభించారు. తద్వారా పేపర్‌లెస్‌ విధానంలో పాస్‌పోర్టు దరఖాస్తుకు అవసరమైన ధృవపత్రాలను సమర్పించే వీలు పౌరులకు కలుగుతుందని పేర్కొన్నారు. దీనివల్ల ఒరిజినల్‌ ధృవపత్రాలను తీసుకెళ్లాల్సిన అవసరం లేదని స్పష్టంచేశారు. పాస్‌పోర్టు దరఖాస్తు సమయంలో డిజిలాకర్‌లో ఉన్న డాక్యుమెంట్ల లింక్‌ను పొందుపరిస్తే సరిపోతుందని చెప్పారు.


మరికొన్ని రోజుల్లోనే డిజిలాకర్‌లో పాస్‌పోర్టును అందుబాటులోకి తెచ్చే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నామని కేంద్ర సహాయమంత్రి మురళీధరన్‌ పేర్కొన్నారు. రానున్న రోజుల్లో అందుబాటులోకి రానున్న పాస్‌పోర్టు సేవ ప్రోగ్రాంలలో కృత్రిమ మేధ, మెషిన్‌ లెర్నింగ్‌, చాట్‌బోట్‌, రోబోటిక్‌ ప్రాసెస్‌ అటోమేషన్‌(RPA) వంటి టెక్నాలజీలను వినియోగిస్తున్నామని తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానంతో ఎన్నో రకాల సేవలను తేలికగా, సాధ్యమైనంత వేగంగా పొందే వీలు కల్పిస్తున్నాయని వివరించారు.