ఫాస్టాగ్‌ వాడకం తప్పనిసరి

 


 జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనాలు టోల్‌ప్లాజాల వద్ద నగదు రూపంలో టోల్‌ ఫీజు చెల్లించే విధానానికి తెరపడింది. సోమవారం అర్ధరాత్రి నుంచి ఫాస్టాగ్‌ వాడకం తప్పనిసరి కానున్నది. అర్ధరాత్రి 12 గంటల తర్వాత ఫాస్టాగ్‌ లేని వాహనాల నుంచి టోల్‌ప్లాజాల వద్ద రెట్టింపు ఫీజు వసూలు చేస్తామని కేంద్ర రోడ్డు, జాతీయ రహదారుల శాఖ ఆదివారం ప్రకటించింది. టోల్‌ప్లాజాల వద్ద రద్దీ, ఇంధన ఖర్చును తగ్గించే లక్ష్యంలో డిజిటల్‌ రూపంలో ఫీజులు చెల్లించే ఫాస్టాగ్‌ విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. 2016లోనే ఫాస్టాగ్‌ విధానాన్ని రూపొందించినప్పటికీ పలు కారణాలతో దీని అమలు వాయిదా పడుతూ వచ్చింది. ఇకపైన ఫాస్టాగ్‌ అమలును వాయిదా వేసే ప్రసక్తే లేదని కేంద్ర రోడ్డురవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ స్పష్టంచేశారు. ఇప్పటి వరకు 2.54 కోట్ల మంది ఫాస్టాగ్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకొన్నారని తెలిపారు. రీచార్జ్‌ కార్డులాగా ఉపయోగించే ఈ ఫాస్టాగ్‌ సర్టిఫికెట్లను దేశవ్యాప్తంగా బ్యాంకులు, పలు రిటైల్‌ సంస్థలు కూడా విక్రయిస్తున్నాయి.