గల్వాన్ లోయలో భారత్-చైనా దళాల మధ్య ఘర్షణ

 


గల్వాన్ లోయలో భారత్-చైనా దళాల మధ్య ఘర్షణ గుర్తుంది కదా. ఈ ఘటన దగ్గర్నుంచే ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ ఉద్రిక్తతలు ఇప్పటికీ పూర్తిగా చల్లబడలేదనే చెప్పాలి. నిన్నగాకమొన్న కూడా రెండు దేశాల ఆర్మీ అధికారుల మధ్య చర్చలు జరిగాయి. ఈ క్రమంలో ఇటీవలే గల్వాన్ ఘటనపై చైనా నుంచి క్లారిటీ ఇచ్చింది. గల్వాన్ దాడి నిజమేనని, ఈ ఘటనలో ఐదుగురు చైనా మిలటరీ అధికారులు మరణించారని పేర్కొంది. వారి ఫొటోలు, వివరాలను వెల్లడించింది.


వీటిపై సోషల్ మీడియాలో ప్రశ్నలు లేవనెత్తిన కొందరిని తాజాగా చైనా అధికారులు అరెస్టు చేశారు. దేశం కోసం ప్రాణాలు ఒడ్డిన సైనికులను అవమానించారంటూ వారిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ అరెస్టయిన వారిలో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు కుయి జిమింగ్ కూడా ఉన్నారు. ఆయన గల్వాన్ దాడి గురించి సోషల్ మీడియాలో మాట్లాడుతూ.. ప్రభుత్వం చెప్పిన దానికన్నా ఎక్కువ మంది సైనికులే ప్రాణాలు కోల్పోయి ఉండే అవకాశాలు చాలా ఉన్నాయని పోస్టు పెట్టాడు.


అలాగే ఇన్ని రోజుల తర్వాత గల్వాన్ దాడి గురించి ప్రభుత్వం ఎందుకు ప్రకటించింది? అని ప్రశ్నించాడు. ఇలా చేసినందుకే అతన్ని చైనా అధికారులు అరెస్టు చేయడం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.