ఉపరితల ద్రోణి కారణంగా రాష్ర్టంలో అక్కడక్కడ వడగళ్లతో వర్షాలు కురిసే అవకాశం

 


 ఉపరితల ద్రోణి కారణంగా రాష్ర్టంలో అక్కడక్కడ వడగళ్లతో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం ఉత్తర కర్ణాటక నుంచి దక్షిణ మధ్య మహారాష్ర్ట వరకు ఉపరితల ద్రోణి, మరట్వాడా మీదుగా విదర్భ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని పేర్కొంది. దీని ప్రభావంతో గురు, శుక్రవారాల్లో ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, నిర్మల్‌, జగిత్యాల, నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులు వడగళ్లతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. బుధవారం రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నల్లవెల్లి, నల్గొండ జిల్లా చింతపల్లి మండలం గాడ్కొండలో అత్యల్పంగా 12.7 డిగ్రీలు, జగిత్యాల జిల్లా మేడిపల్లిలో అత్యధికంగా 36.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని తెలిపింది.