యాంటీ రాడికలిజం బిల్లును ఆమోదించిన ఫ్రాన్స్ - ఆందోళనలో ముస్లింలు

 


రాడికల్‌ ఇస్లామిస్ట్‌ల నుంచి ఫ్రాన్స్‌ను పరిరక్షించే పేరుతో మసీదులు, పాఠశాలలు, క్రీడా క్లబ్లుల పర్యవేక్షణను మరింత బలోపేతం చేసేందుకు ఉద్దేశించిన బిల్లును మంగళవారం ఫ్రాన్స్‌ పార్లమెంట్‌ అధిక మెజారిటీతో ఆమోదించింది. రెండు వారాలపాటు తీవ్రంగా దీనిపై చర్చలు జరిగిన తర్వాత నేషనల్‌ అసెంబ్లీ దిగువ సభలో ఓటింగ్‌ జరిగింది. 347-151 ఓట్ల తేడాతో బిల్లు ఆమోదం పొందింది. 65మంది ఓటింగ్‌కు గైర్హాజరయ్యారు. దేశంలో తీవ్రవాదం చెలరేగే ప్రమాదముందన్న వాదనతో విభేదించేవారు తక్కువమందే వుంటారు. కానీ ఈ ప్రతిపాదిత చట్టాన్ని ఒక రాజకీయ కుట్రగా విమర్శకులు చూస్తున్నారు. వచ్చే ఏడాది అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మాక్రాన్‌ సెంట్రిస్ట్‌ పార్టీ వైపునకు మితవాదులను కూడా ఆకర్షించడం దీని వెనుక ఆలోచనగా వుందని భావిస్తున్నారు. ఈ బిల్లును ముస్లింలు, కొంతమంది శాసనకర్తలు, ఇతరులు చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. దేశంలోనే రెండవ మతంగా వున్న ఇస్లాంను వేలెత్తి చూపుతూ, అత్యవసరమైన స్వేచ్చా, స్వాతంత్య్రపు హక్కుల్లోకి ప్రభుత్వం చొరబడుతుందని ఆందోళన చెందుతున్నారు.