'అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్'లో ఉచిత శిక్షణ కోసం గిరిజన లా గ్రాడ్యుయేట్స్ నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి పి.కమలాకర్‌రెడ్డి సోమవారం వెల్లడించారు. ఈ పథకం కింద ఎంపికైన లా గ్రాడ్యుయేట్స్‌కు మూడేళ్ల పాటు నెలకు రూ.వెయ్యి వేతనంతో పాటు, పుస్తకాలు, లైబ్రరీ ఫీజు, బార్‌కౌన్సిల్ ఫీజు, ఆఫీస్ ఫర్నిచర్ తదితర వాటి కొనుగోలుకు సంవత్సరానికి రూ.6000 అందివ్వనున్నట్లు తెలిపారు. జిల్లా నుంచి ముగ్గురు గిరిజన అభ్యర్థులకు మాత్రమే ఈ అవకాశముందని స్పష్టం చేశారు. అర్హులైన అభ్యర్థులు నాంపల్లిలో ఎస్బీహెచ్ గృహకల్ప బిల్డింగ్‌లోని కార్యాలయంలో సంప్రదించాలని తెలిపారు.
విదేశాల్లో విద్య కోసం...
విదేశాల్లో విద్యనభ్యసించాలనే ఆసక్తి ఉన్న గిరిజన విద్యార్థులకు జీఆర్ఈ, జీమ్యాట్, టోఫెల్ తదితర కోర్సుల్లో ఉచిత శిక్షణ అందివ్వనున్నట్లు తెలిపారు. జీఆర్ఈ, జీమ్యాట్, టోఫెల్ తదితర ప్రవేశపరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద విదేశాల్లో విద్యనభ్యసించే అవకాశముంటుంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఆయా కోర్సుల్లో విద్యార్థులకు ఉచిత శిక్షణను అందిస్తున్నది. అర్హులైన, ఆసక్తి ఉన్న గిరిజన విద్యార్థులు ఈ పాస్ వెబ్సైట్ దరఖాస్తు చేసుకోవాలని వివరించారు. ఇతర వివరాలకు ఓల్డ్ బోయిన్పల్లి బాపూజీనగర్‌లోని ప్రభుత్వ బాలిక ప్రాథమిక పాఠశాల పక్కనున్న జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కార్యాలయంలో సంప్రదించాలన్నారు.