జిఎస్‌టి వసూళ్లలో రికార్డు మోత

  


జిఎస్‌టి వసూళ్లలో రికార్డు మోత మోగింది. జనవరి నెలకు రూ.1.19 లక్షల కోట్లు జిఎస్‌టి రూపంలో వసూలైనట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. జిఎస్‌టి అమల్లోకి వచ్చాక భారీ మొత్తంలో వసూలు కావడం ఇదే తొలిసారని పేర్కొంది. గతేడాది జనవరితో పోలిస్తే 8 శాతం అధికంగా వసూలయ్యాయి. గతేడాది ఇదే నెలకు రూ.1.11 లక్షల కోట్లు జిఎస్‌టి కింద వసూలయ్యాయి. దాదాపు 1.2 లక్షల కోట్ల మార్కును తాకిందని, గత నెలలో 1.15 లక్షల కోట్లు వసూలు అయినట్లు ఓ ప్రకటనలో తెలిపింది. దాదాపుగా నాలుగు నెలల నుండి జిఎస్‌టి వసూళ్లు లక్ష కోట్లను దాటుతున్నాయి.

జనవరి 31 వరకు (సాయంత్రం 6 గంటల వరకు) మొత్తం రూ.1,19,847 కోట్లు వసూలైనట్లు కేంద్రం వెల్లడించింది. ఇందులో సిజిఎస్‌ట్టి కింద రూ.21,923 కోట్లు, ఎస్‌జిఎస్‌టి కింద రూ.29,014 కోట్లు, ఐజిఎస్‌టి కింద రూ.60,288 కోట్లు వసూలైనట్లు కేంద్రం తెలిపింది. సెస్సుల రూపంలో రూ.8,622 కోట్లు సమకూరినట్లు పేర్కొంది. డిసెంబర్‌ నెలకు సంబంధించి జనవరి 31 వరకు 90 లక్షల జిఎస్‌టి-3బి రిటర్నులు దాఖలైనట్లు పేర్కొంది.