ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నేడు నీతి ఆయోగ్‌ పాలకమండలి ఆరో సమావేశం

 ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నేడు నీతి ఆయోగ్‌ పాలకమండలి ఆరో సమావేశం జరుగనుంది. 10.30గంటలకు వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా జరిగే సమావేశంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, లెఫ్టినెంట్‌ గవర్నర్లు, కేంద్రమంత్రులు, నీతి ఆయోగ్‌ ఉపాధ్యక్షుడు, సీఈఓ సహా సభ్యులు పాల్గొననున్నారు. వ్యవసాయం, పరిశ్రమలు, తయారీ రంగాలు, మానవ వనరుల అభివృద్ధి, కిందిస్థాయిలో సేవలు, వైద్యం, పౌష్టికాహారం తదితర అంశాలపై విస్తృతంగా చర్చించనున్నారు. జమ్మూకశ్మీర్‌ కేంద్ర పాలితప్రాంతంగా, లఢఖ్‌ తొలిసారిగా ఈ సమావేశంలో పాల్గొంటున్నది. ప్రత్యేకంగా కరోనా, తదనంతర పరిణామాలపై అనుసరించాల్సిన ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. సమావేశంలో తెలంగాణ తరఫున సీఎం కేసీఆర్‌ హాజరుకానున్నారు. రాష్ట్రానికి సంబంధించి కేంద్రం నుంచి అందాల్సిన తోడ్పాటుపై ప్రస్తావించనున్నారు. అలాగే తెలంగాణ సాధించిన విజయాలను సమావేశంలో ప్రధానికి వివరించనున్నారు. రాష్ట్రానికి గతంలో నీతి ఆయోగ్‌ చేసిన సిఫారసులను ప్రస్తావించే అవకాశం ఉంది.  కరోనా తర్వాత రాష్ట్రాల ఆదాయాలు గణనీయంగా పడిపోవడంతో పాటు ఆర్థికవ్యవస్థ దెబ్బతిన్న పరిస్థితుల్లో కేంద్రం తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి కొన్ని అంశాలపై ఆయా రాష్ట్రాల సీఎంలు ప్రస్తావించనున్నారు. కాగా, నీతి ఆయోగ్‌ తొలి సమావేశం ఫిబ్రవరి 8, 2015న జరగ్గా.. గతేడాది కొవిడ్‌-19 మహమ్మారి కారణంగా కౌన్సిల్‌ సమావేశం నిర్వహించలేదు.