తెలుగు సినిమాలపై బాలీవుడ్‌ ‌ మీడియా గుర్రుగా ఉందా?

 


తెలుగు సినిమాలపై బాలీవుడ్‌ ‌ మీడియా గుర్రుగా ఉందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎందుకంటే.. ఒకప్పుడు ఇండియన్‌ సినిమా అంటే కేవలం బాలీవుడ్‌ సినిమాలే అని ఇతర దేశస్థులు భావించేవారు. కానీ ఎప్పుడైతే బాహుబలి విడుదలైందో అప్పుడు పరిస్థితులు మారిపోయాయి. టెక్నికల్‌గా, విజువల్‌గా మన తెలుగు సినిమా సత్తా బాలీవుడ్‌కే కాదు, ప్రపంచానికి కూడా తెలిసింది. ఈ విజయాన్ని కంటిన్యూ చేస్తూ శాండిల్‌వుడ్‌కి చెందిన కేజీయఫ్‌ ఛాప్టర్‌ 1 కూడా ప్యాన్‌ ఇండియా మూవీగా విడుదలై బాక్సాఫీస్‌ను షేక్‌ చేసింది. ఈ రెండు సినిమాలు ఇచ్చిన ధైర్యంతో మన సౌత్‌ ఇండస్ట్రీకి చెందిన దర్శక నిర్మాతలు డిఫరెంట్‌ సినిమాలను చేయడానికి రెడీ అయ్యారు. ఇప్పుడు సౌత్‌లో మెయిన్‌ స్టార్స్‌ అందరూ పాన్‌ ఇండియా రేంజ్‌లో సినిమాలు చేస్తూ బాలీవుడ్‌కి షాక్‌ ఇస్తున్నారు. మన సౌత్‌ పాన్ ఇండియా సినిమాల తాకిడికి బాలీవుడ్‌ డీలా పడిందనే విషయం ఎవరూ కాదనలేనిది.


దీన్ని అధిగమించడానికి బాలీవుడ్‌ మీడియా సౌత్‌ ప్యాన్‌ ఇండియా సినిమాలపై తన అక్కసుని వెల్లగక్కుతోంది. మన తెలుగు సినిమాలకు పోటీగా విడుదలవుతున్న బాలీవుడ్ సినిమాలకు ప్యాన్‌ ఇండియా రేంజ్‌ లేకపోయినా, మన సినిమాలకు బాలీవుడ్ సినిమాలు పోటీనిస్తున్నాయంటూ గగ్గోలు పెడుతోంది. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ బడ్జెట్‌ పాన్‌ ఇండియా మూవీ 'ఆర్‌ఆర్‌ఆర్‌'తో అజయ్‌ దేవగణ్‌ హీరోగా రూపొందుతోన్న 'మైదాస్‌' అక్టోబర్‌ 15న విడుదలవుతుంది. అలాగే రాధేశ్యామ్‌తో జాన్‌ అబ్రహం సత్యమేవజయతే2 పోటీ పడుతుంది అంటూ బాలీవుడ్‌ మీడియా రాసుకొచ్చింది. మైదాన్‌ సినిమాను దక్షిణాది భాషల్లోనూ విడుదల చేస్తున్నారు. కాబట్టి దీన్ని పాన్‌ ఇండియా మూవీ అనుకున్నా, సత్యమేవజయతే 2 మూవీకి పాన్‌ ఇండియా రేంజ్‌ లేదు. కానీ రాధేశ్యామ్‌తో సత్యమేవజయతే 2 పోటీ అంటూ బాలీవుడ్‌ మీడియా రాసుకొచ్చింది. అయితే ఇలా రాయడం వెనుక అంతరార్థమేంటో బాలీవుడ్ వర్గాలకే తెలియాల్సి ఉంది.