నిబంధనలు అందరికీ ఒకటే: మేయర్‌

 


 గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కొత్త మేయర్‌గా ఎన్నికైన గద్వాల విజయలక్ష్మికి శుభాకాంక్షలు తెలుపుతూ ఆమె మద్దతుదారులు పలువురు నగరంలో పలుచోట్ల ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అనధికారికంగా వాటిని ఎలా పెడతారంటూ నెటిజన్లు ఫొటోలు తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంతో జీహెచ్‌ఎంసీ అధికారులు స్పందించారు. ఈవీడీఎం విభా గం శనివారం సాయంత్రం నగరంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తించారు. మొత్తం 30 చలాన్లు రాసి, సుమారు రూ.6లక్షల జరిమానాను విధించారు


చట్టం ముందు అందరూ సమానమేనని, తన మీద అభిమానంతో నిబంధనలను ఉల్లంఘిస్తూ ఫ్లెక్సీ పెట్టిన వారికి జరిమానా వేశామని జీహెచ్‌ఎంసీ మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి తెలిపారు. గ్రేటర్‌ పరిధిలో మనకంటూ ప్రత్యేకంగా నిబంధనలున్నాయని, వాటిని అందరూ పాటించాల్సిందేనన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన వారికి జరిమానా వేయడాన్ని తాను స్వాగతిస్తున్నానన్నారు. ఇలా చేసినప్పుడు నగర ప్రజలు నిబంధనలను పాటిస్తారని ఆమె పేర్కొన్నారు.