రాష్ట్రపతి భవన్‌లోని మొఘల్‌ గార్డెన్‌ పర్యాటకులకు స్వాగతం

 రాష్ట్రపతి భవన్‌లోని మొఘల్‌ గార్డెన్‌ పర్యాటకులకు స్వాగతం పలుకుతోంది. ఏడాదంతా రాష్ట్రపతి భవన్‌కే పరిమితమయ్యే 15 ఎకరాల సువిశాలమైన పూదోట మొఘల్‌ గార్డెన్‌లోకి 'ఉద్యానోత్సవ్‌' పేరిట ఏటా ఫిబ్రవరి- మార్చి నెలల్లో సందర్శకులకు అనుమతిస్తారు. 'ఉద్యానోత్సవ్‌' కార్యక్రమాన్ని రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ శుక్రవారం ప్రారంభించనున్నారు. ఫిబ్రవరి 13 నుంచి మార్చి 21 వరకు ఉదయం నుంచి సాయంత్రం 5.00 గంటల మధ్య ఉచితంగా గార్డెన్స్‌లోకి అనుమతించనున్నారు.    అరవిరిసిన తులిప్‌ పూలు, విరగ్గాసిన గులాబీలు, విప్పారిన చేమంతులు, పరిమళాలు వెదజల్లే మల్లెలు.. ఔషధ మొక్కలు, బోన్సాయ్‌ వృక్షాలు, కాక్టస్‌ కార్నర్‌ ఇలా రకరకాల పూలు, మొక్కలు పర్యాటకులకు ఆనందాన్ని పంచనున్నాయి. అలాగే అమెరికన్ హెరిటేజ్, ఫస్ట్ ప్రైజ్, కిస్ ఆఫ్ ఫైర్, డబుల్ డిలైట్తో పాటు వివిధ రకాల గులాబీలు, నార్సిసస్, డహ్లియా, స్పరాక్సిస్, రానున్కులస్, హయాసియంత్, ఆసియాటిక్ లిల్లీ ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఈ సారి ఆన్‌లైన్‌లోనే టికెట్‌ బుకింగ్‌ అందుబాటులో ఉంది. మొఘల్‌ గార్డెన్‌ వద్ద ఎంట్రీ టికెట్లు ఇవ్వరని అధికారులు స్పష్టం చేశారు.    ప్రోటోకాల్స్‌ ప్రకారం అధికారులు ఏర్పాట్లు చేశారు. ఎప్పటికప్పుడు శానిటైజేషన్‌ చేపట్టనున్నారు. సందర్శన ప్రాంతాల్లో వివిధ ప్రదేశాల్లో తాగునీరు, మరుగుదొడ్లు, ప్రథమ చికిత్స అందించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్రపతి డిప్యూటీ ప్రెస్‌ సెక్రెటరీ కృతి తివారీ తెలిపారు. కరోనా మహమ్మారి కారణంగా ఆన్‌లైన్‌లో ప్రతి స్లాట్‌కు కేవలం వంద మందికి అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు రాష్ట్రపతి భవన్‌ ప్రాంగణంలో ఐదుగురికి మించి ఒకే ప్రాంతంలో నిలబడేందుకు అనుమతి లేదన్నారు. నార్త్ అవెన్యూకి దగ్గరగా ఉన్న ప్రెసిడెంట్స్ ఎస్టేట్ గేట్ నంబర్ 35 నుంచి సందర్శకులు మొఘల్ గార్డెన్‌లోకి ప్రవేశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.