ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి గానూ హైదరాబాద్ నగరంలో బైక్ ర్యాలీలకు అనుమతిలేదని పోలీసు అధికారులు స్పష్టం చేశా రు.ఎన్నికల ఏర్పాట్లపై శుక్రవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కమిషనర్, ఎన్నికల అధికారి డీఎస్ లోకేశ్‌కుమార్ నిర్వహించిన సమావేశంలో నగర పోలీస్ అడిషనల్ సీపీ డీఎస్ చౌహాన్, జాయింట్ సీపీ అరుణ్‌జోషి, సెంట్రల్ జోన్ జాయిం ట్ సీపీ విశ్వప్రసాద్, ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రియాంక, అడిషనల్ కమిషనర్ పంకజ పాల్గొన్నారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో 191పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, వీటికి విస్తృత బందోబస్తును ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రచారానికి సంబంధించి ర్యాలీలు, సభలు, సమావేశాలపై ముందస్తుగా అనుమతులు పొందాలని అడిషనల్ కమిషనర్ చౌహాన్ స్పష్టం చేశారు. ఎన్నికలకు సంబంధించి రిసెప్షన్, కౌంటింగ్ కేంద్రాన్ని ఎల్బీస్టేడియంలో ఏర్పాటు చేయనున్నట్లు లోకేశ్‌కుమార్ తెలిపారు. ఒక్కోహాల్లో ఏడు టేబుళ్ల చొప్పున 8 గదుల్లో కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, కౌంటింగ్ 40 గంటలకు పైగా సమయం పట్టే అవకాశం ఉందని చెప్పారు.