భారత్‌కు చెందిన అతిపెద్ద టెలికం ఆపరేటర్ రిలయన్స్ జియోకు రైతు నిరసనల ప్రభావం తాకింది. హర్యానా, పంజాబ్ రాష్ట్రాలలో జియో వైర్లెస్ సబ్స్క్రైబర్ల సంఖ్య తగ్గిపోయింది. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ సమాచారం ప్రకారం.. గతేడాది డిసెంబర్‌కు సంబంధించి ది టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రారు) సమాచారం ప్రకారం ఈ రెండు రాష్ట్రాలలో రిలయన్స్ జియో తన సబ్స్క్రైబర్లను కోల్పోయింది. అలాగే, ఇదే నెలలో అధిక సంఖ్యలో సబ్స్క్రైబర్లను కోల్పోయిన మేజర్ ఆపరేటర్ జియో అని తేలింది. గతేడాది డిసెంబర్ చివరినాటికి పంజాబ్‌లో 1.25 కోట్ల మంది వినియోగదారులున్నారు. అయితే అంతకముందు నెల నవబంర్‌లో ఈ వినియోగదారుల సంఖ్య 1.40 కోట్ల మంది ఉండగా.. 25 లక్షల మంది జియోకు దూరమయ్యారు. ఈ విధంగా పంజాబ్‌లో అధిక సంఖ్యలో వినియోగదారులను కోల్పోవడం జియోకు ఇది రెండో సారి కావడం గమనార్హం. ఇక హర్యానాలో గతేడాది నవంబర్‌లో రిలయన్స్ జియో వినియోగదారుల సంఖ్య 94.48 లక్షల మంది ఉన్నారు. అదే ఏడాది డిసెంబర్ నాటికి ఈ సంఖ్య 89.07 లక్షలకు తగ్గిపోయింది. 2016 సెప్టెంబర్‌లో రిలయన్స్ జియో ఆవిర్భావం తర్వాత వినియోగదారుల సంఖ్య ఈ విధంగా గణనీయంగా పడిపోవడం గమనించాల్సిన అంశం. వినియోగదారుల సంఖ్య తగ్గిపోవడం జియోకు నష్టాన్ని కూడా తీసుకొచ్చింది. ఈ మేరకు ఈ విషయాన్ని రిలయన్స్ ఒక ప్రకటనలో సైతం పేర్కొనడం గమనార్హం. కాగా, అదానీ, అంబానీ వంటి కార్పొరేట్ల ప్రయోజనాల కోసమే కేంద్రం వివాదాస్ప వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చిందని ఆరోపిస్తూ ఢిల్లీ సరిహద్దు ప్రాంతాల్లో నిరసనలు కొనసాగిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా నిరసనలు చేస్తున్న రైతన్నలు సదరు కార్పొరేట్ కంపెనీలకు వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు.